దారుణం... ప్రాణం తీసిన ఎగ్ బజ్జీ

దారుణం... ప్రాణం తీసిన ఎగ్ బజ్జీ

ముద్ర,వనపర్తి:- ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ మన కళ్ళ ముందే హాయిగా గడిపిన వాళ్లు హఠాత్తుగా మృత్యువాత పడుతుంటారు. ఇదే విధంగా ఎగ్ బజ్జీ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. తనకు ఎంతో ఇష్టమైన ఎగ్ బజ్జీని తింటూ అతడు మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ విషాద ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. జిల్లాలోని మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామానికి చెందిన దాసరి తిరుపతయ్య(39) అనే వ్యక్తి ఇంటి వద్ద ఎగ్ బజ్జీ తింటూ ప్రమాదానికి గురయ్యాడు.

ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో గుడ్డు ఇరుక్కుంది. దీంతో ఆ గుడ్డును కక్కలేక మింగలేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడకపోవడంతో చూస్తుండగానే తిరుపతయ్య ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే తిరుపతయ్య మరణించడంతో భార్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా మృతుడు తిరుపతయ్యకు భార్య సువర్ణ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. తిరుపతయ్య చేపల వేటతో పాటు హమాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.