ఎయిర్‌పోర్టులో విషాదం: వీల్‌చైర్ లేక నడుచుకుంటూ వెళ్లి వృద్ధుడు మృతి

ఎయిర్‌పోర్టులో విషాదం: వీల్‌చైర్ లేక నడుచుకుంటూ వెళ్లి వృద్ధుడు మృతి

ముద్ర, సెంట్రల్ డెస్క్:-మహారాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ అందుబాటులో లేకపోవడంతో 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. విమానం వద్ద నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి అక్కడే కుప్పకూలి చనిపోయాడు. 

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు గత సోమవారం తన భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో న్యూయార్క్ నుంచి ముంబై చేరుకున్నారు. టికెట్ కొనుగోలు సమయంలోనే వీరిద్దరూ వీల్‌చైర్ ప్రయాణికులుగా బుక్ చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో సరిపడా చక్రాల కుర్చీలు అందుబాటులో లేకపోవడంతో వీరికి ఒకటే ఇచ్చారు. దీంతో తన బార్యను ఒక వీల్ చైర్‌లో కూర్చోబెట్టిన అతడు.. ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లాడు.అయితే, విమానం దిగిన ప్రాంతం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు నడిచి అతడు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు. కాగా, ఈ ఘటనపై ఎయిరిండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.