జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
- చిన్న కొల్వాయిలో 100 శాతం పోలింగ్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాక్షికంగా వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 7,12,710 మంది ఓటర్లు ఉండగా 983 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే వివిధ వర్గాల వారికోసం జిల్లాలో 36 థిమాటిక్ పోలింగ్ కెంద్రాలను ఏర్పాటు చేయగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 990 సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరాగ మధ్యాహ్నం మందకోడిగా సాగింది.
ఎండా తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, నర్శింగ్ కళాశాలలో, నిజామాబాదు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, ఎమ్మెల్సి ఎల్ . రమణ పురాణి పేట హైస్కూల్ లో, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంతర్గామ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష జిల్లాలో పోలింగ్ కేంద్రలాను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
జిల్లా ఎస్పి సన్ ప్రిత్ సింగ్, ఎఎస్పి శివం ఉపాధ్యాయాలు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పట్లు పర్యవేక్షించారు. బిరుపూర్ మండలం చిన్న కొల్వాయిగ్రామంలో ఓటర్లు అందరు తమ ఓటు హక్కు వినియోగించుకోగా అక్కడ వంద శాతం పోలింగ్ నమోద్ అయింది. ఆ పోలింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లాలో సాయంత్రం వరకు 69 శాతం పోలింగ్ నమోద్ అయింది.