రాబోయే ఎన్నికల్లో 14 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం

రాబోయే ఎన్నికల్లో 14 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం
  • సవాల్ కు సి ఎం సిద్ధమా?
  • రైతుల కంటే రాజకీయాలంటేనే సీఎం కు మక్కువ
  • అబద్ధపు హామీలతో రైతులను మోసం చేశారు
  • ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఎన్నికలకు ముందు రైతులకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు సంక్షేమం పూర్తిగా అడుగంటిందని బిజెఎల్పి నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతులను మభ్యపెట్టి గద్దె ఎక్కిన కాంగ్రెస్ రాష్ట్రంలో 14 ఎంపి స్థానాలు గెలిస్తే రాజకీయ సన్యాసానికి తాను సిద్ధమని, రేవంత్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు 
రైతు సత్యాగ్రహ దీక్ష స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రbసర్కార్ కు ముందుచూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సాగు నీరు, విద్యుత్ సరఫరా వంటి ప్రధాన రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్ధపు హామీలు ఆశ చూపి వారిని మోసగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. రైతాంగానికి రూ.2 లక్షల రుణమాఫీ ఇప్పటికీ ఇవ్వలేదని,పంటకు రూ.500 బోనస్ హామీకి గతిలేదని అన్నారు. రైతు భరోసా పేరిట ఇస్తామన్న రూ.15 వేల సాయం ఏమైందని ప్రశ్నించారు.

కౌలు రైతులకు ఇస్తామన్న రూ. 12 వేల సాయం ఎటు పోయిందన్నారు. సాగు నీరు లేదు, సబ్సిడీలు లేవు, రైతులకు మనుగడ కూడా లేదన్నారు. పంటలు ఎండిపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదన్నారు.పంట నష్టపోయిన రైతులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. దమ్ముంటే హామీలు అమలు చేశాకే లోక సభ ఎన్నికల ప్రచారానికి రావాలని,లేని పక్షంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎంఎల్ఏ  రామారావు పటేల్, బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రాం నాథ్, అయ్యన్నగారి భూమయ్య, సాదం అరవింద్, మెడిసిమ్మె రాజు, అలివేలు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.