సొంత భవనాలు లేక అద్దే భవనాలు దిక్కు

సొంత భవనాలు లేక అద్దే భవనాలు దిక్కు
  • అద్దెల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
  • మంత్రి ఉత్తమ్ సహకారంతో నూతన భవనాలు నిర్మించాలి

హుజూర్ నగర్  ముద్ర ప్రతినిధి:- ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నప్పటికీ సొంత భవనాలు లేక అద్దె భవనంలోనే తమ కార్యకలాపాలు ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన హుజూర్నగర్ పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా సొంత భవనాలు లేకపోవడంతో కిరాయి భవనాల్లోనే ఉద్యోగులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సొంత భవనం లేకపోవడంతో కిరాయి భవనంలో లక్షల రూపాయలు చెల్లించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ కార్యాలయంకు సొంత భవనం లేకపోవడంతో గత 30 సంవత్సరాలుగా ఒకే కిరాయి భవనంలో అధికారులు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ఈ రెండు శాఖలు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయినప్పటికీ సొంతభవనాలు లేకపోవడం విచారకరం. ఎక్సైజ్ కార్యాలయం లో కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయి. వారు పట్టుకున్న వాహనాలు నిలువ చేయడానికి స్థలం కూడా లేని పరిస్థితి. గత 30 సంవత్సరాలుగా ఇదే భవనంలో తమ కార్యకలాపాలను అధికారులు నిర్వహిస్తున్నారు.

అధికారులు పట్టుకున్న వాహనాలను నిలువ చేయడానికి స్థలం లేకపోవడంతో వాహనాలు కూడా ప్రక్కదోవ పట్టే పరిస్థితి  ఉంది. వాహనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల రూపాయల కిరాయిలను చెల్లిస్తున్నారు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా సొంత భవనం లేదు. 30 సంవత్సరాలుగా కిరాయి భవనంలోని నిధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వీటి కార్యాలయం నిర్మాణం కోసం స్థలాలు కేటాయించినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో అద్దె భవనంలోనే కొనసాగుతున్నారు . ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి . మహిళా ఉద్యోగులు కూర్చోవడానికి ప్రత్యేక గదులు కూడా లేవు . ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న శాఖలు అద్దె భవనాల్లో మగ్గుతున్నాయి. ఆయా భవనాలలో సరైన భద్రత కూడా లేదని పలువురు ఉద్యోగులు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవ తీసుకొని సొంత భవనాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. నియోజకవర్గం లో అనేక భవనాలకు నిధులు మంజూరు చేసి భవనాలు ఏర్పాటు చేస్తున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవ తీసుకొని ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న ఈ రెండు శాఖలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.