‘ఉపాధి’ని వ్యవసాయంతో అనుసంధానించాలి

‘ఉపాధి’ని వ్యవసాయంతో అనుసంధానించాలి
  • కూలీలకు గిట్టుబాటు ధర కల్పించాలి
  • ‘ఉత్తర యుద్ధం’ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి

నర్సంపేట, ముద్ర:  ఉపాధిహామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి కూలీలకు గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మహ్మదాపురం గ్రామంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి పోస్ట్ కార్డుల ద్వారా ఉపాధిహామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ‘ఉత్తర యుద్ధం’ కార్యక్రమాన్ని శనివారం రైతులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఉపాధిహామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.

కూలికి రూ.257 చెల్లించాలని నిబంధన ఉన్న రూ.100 కూడా రావడం లేదన్నారు. ప్రతి ఒక్క రైతు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పోస్ట్ కార్డు ద్వారా తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రూ.4.41 కోట్లతో వెంకటాపురం నుంచి మహమ్మదాపురం మీదుగా నర్సంపేట మండలం రాజేశ్వరరావుపల్లి వరకు బీటీ నిర్మాణానికి, రూ.1.20 కోట్లతో మహ్మదాపురంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కోమల భద్రయ్య, వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి, మహ్మదాపురం పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు, ఎంపీటీసీ చింత లావణ్య యుగంధర్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.