మల్కాజిగిరి లో3 లక్షల 91 వేల ఓట్ల మెజారిటీతో ఈటెల ఘన విజయం...

మల్కాజిగిరి లో3 లక్షల 91 వేల ఓట్ల మెజారిటీతో ఈటెల ఘన విజయం...
  • నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను...

ముద్ర ప్రతినిధి,మేడ్చల్: దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి పార్లమెంటు స్థానం లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ బారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పై ఈటెల 3 లక్షల91వేల 655 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోకవర్గం లో మొత్తం 37 లక్షల 79 వేల 596 ఓటర్లు ఉండగా, ఈ సారి ఎన్నికల లో 17 లక్షల 48 వేల ఓట్లు పోలయ్యాయి.మొదటి నుండి అందరి దృష్టిని ఆకర్షించిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానం గెలుపు కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా పోరాడినా అంతిమ విజయం మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్ధిని వరించింది.

మొత్తం 21 రౌండ్ల లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో ప్రతి రౌండ్ లోనూ ఈటెల రాజేందర్ ఆధిక్యత సాధించారు.కౌంటింగ్ అనంతరం ఆయన కీసర లోని హోలీ మేరీ కాలేజీ లో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో  ఎన్నికల అధికారి,మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా గెలుపుదృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల మీడియా తో మాట్లాడుతూ తనపైన ఉన్న విశ్వాసంతో ఇంత బారీ మెజారిటీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలకు ఎల్లప్పుడూ రుణ పడి ఉంటానని చెప్పారు.మీ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు  అమలుచేయించేందుకు ఎంత వరకైనా కొట్లాడుతానని తెలిపారు. మోదీ ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో బాగస్వామి అవుతానని హామీ ఇచ్చారు.