సూరత్ లో కుప్పకూలిన ఆరు అంతస్థుల భవనం

సూరత్ లో కుప్పకూలిన ఆరు అంతస్థుల భవనం

SURAT: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఒక ఆరు అంతస్థుల భవనం శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఆ భవనం శిథిలాల కింద పలువురు నివాసితులు చిక్కుకుని వున్నట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఒక మహిళను వారు రక్షించారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సాలిగామ్ లోని డీఎస్ నగర్  సొసైటీలో ఈ ప్రమాదం సంభవించింది. చోర్యాసీ శాసనసభ్యుడు సందీప్ దేశాయ్, సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లౌట్, జిల్లా కలెక్టర్ సౌరభ్ పార్థి, మున్సిపాల్ కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక దళాధికారి బసంత్ పారిక్ అక్కడ శిథిలాల తొలగింపు, ఇతర రక్షణ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాత్రి కూడా సహాయక కార్యక్రమాలు చురుగ్గా కొనసాగించేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. కూలిన ఈ భవనంలో ఎక్కువ మంది జౌలి కార్మికులే ఉన్నారని సమాచారం. 15 మంది గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.