విఓఏ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు

విఓఏ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు
  • పరిష్కరించాలి
  • కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి
  • విఓఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షురాలు రమ

ముద్ర, ముషీరాబాద్: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఐకెపి విఓఏలు చలో ఇంద్ర పార్క్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ధర్నాచౌక్ లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షురాలు రమ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని 43 రోజులుగా సమ్మె చేస్తున్న వివోఏ ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వీరితో వెట్టిచాకిరి చేస్తుందని మండిపడ్డారు.

విఓఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి 26 వేల కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి విఓఏ లతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అన్నారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న విఓఏలపై పాలకులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. చర్చలకు పిలవకుండా సమ్మె విరమించాలని బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగేషు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 17606 మంది గ్రామస్థాయిలో విఓఏలుగా పనిచేస్తున్నామని తెలిపారు. మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం 8 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి 26 వేల కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
సంఘం నాయకులు, విఓఏలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.