ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో

ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ధాన్యం కొనుగోలు తరలింపులో అధికారులు జాప్యం చేయడాన్ని నిరసిస్తూ చెన్నూర్ మండలం ఎల్లక్కపేట గ్రామ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆదివారం ఉదయం రైతులు 63వ జాతీయ రహదారి పై ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించి వాహనాలు నిలిపి వేశారు. ఐ కెపి కేంద్రం వద్ద సంచుల్లో నింపిన ధాన్యం తరలించడానికి లాఠీలు లేకపోవడం మరోవైపు అకాల వర్షం వచ్చే సూచనలు ఉండడంతో రైతులు ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న అధికారులు ఆర్టీఓ అధికారులతో చర్చించి వాహనాలు సమకూర్చారు. ధీంతో రైతులు ఆందోళన విరమించారు. అయితే రైతులు మాత్రం అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ధాన్యంలో తరుగు పేరుతో కోత పెడుతున్నారని ఆరోపించారు. ధాన్యం నిలువలు ఉన్న ప్రాంతాలకు సకాలంలో వాహనాలు పంపకపోవడం వల్ల కల్లాల వద్దనే రాత్రి పగలు కాపలా ఉండాల్సి వస్తుందని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ధాన్యం తరలింపులో అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు.