నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి

నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి
  • మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 
  • కలెక్టర్ కు జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ వినతి

ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి, పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు రూ. 500 చెల్లించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కొంగరకలాన్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు అరకపురి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవీలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలకు, రైతులకు నష్టపరిహారం, పంటకు మద్దతు ధర క్వింటాలకు రూ. 500 అదనంగా చెల్లించాలని, ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని, చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తుందన్నారు.

వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను నియమించి యుద్ద ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వరితో పాటు వివిధ పంటలకు మద్దతు ధరకు అదనంగా రూ. 500 చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. ఖరీఫ్ నుంచే ఈ బోనస్ చెల్లింపును అమలు చేస్తామని ఇప్పటికీ చేయలేదన్నారు. యాసంగి పంటలకు బోనస్ చెల్లించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. త‌మ రెండు డిమాండ్లయిన పంట నష్టం వివరాల సేకరణ, బోనస్ చెల్లింపులపై సానుకూలంగా స్పందించి నష్టపరిహారం, క్వింటాల్ కు మద్దతు ధరలను అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకట రమణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, ఇతర ముఖ్య నేతలు అదనపు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.