వర్షం కురియడంతో పత్తి విత్తనాలు దుక్కుల్లో విత్తుతున్న రైతులు

వర్షం కురియడంతో పత్తి విత్తనాలు దుక్కుల్లో విత్తుతున్న రైతులు
  • వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉన్న రైతాంగం
  • తాము కోరిన పత్తి విత్తనాలు రాలేదంటున్న పలువురు రైతులు
  • ఇంకా దుకాణాల్లోకి రాని యుఎస్ 7067 పత్తి విత్తనాలు
  • రైతులు కోరే విత్తనాలు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు

తుంగతుర్తి ముద్ర:- రోహిణి కార్తె ఆరంభం నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సరియైన వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గత పక్షం రోజుల క్రితం ఒకటి రెండు భారీ వర్షాలు కురిసిన తిరిగి మళ్లీ వర్షాలు రాకపోవడంతో దుక్కులు దున్ని విత్తనాలు విత్తడానికి సిద్ధంగా ఉన్న రైతులకు తీవ్ర నిరాశ ఎదురయింది. కాగా మంగళ బుధవారాల్లో తుంగతుర్తి మండలంలో వర్షం కురియడంతో రైతులను ఆనందం వెల్లి విరిసింది .ఇప్పటిదాకా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్న రైతులకు కురిసిన వర్షం సంతోషాన్నిచ్చింది .గురువారం రైతులు తమ తమ వ్యవసాయ పొలాల్లో బిజీబిజీగా కనిపించారు. కొంతమంది రైతులు ఇప్పటికే సిద్ధం చేసుకున్న దుక్కులలో పత్తి విత్తనాలు విత్తడం కనిపించింది .మరి కొంతమంది రైతులు దుక్కులలో పత్తి విత్తనాలు విత్తడానికి అచ్చులు తోలుకుంటున్నారు .మరి కొంతమంది రైతులు పత్తి విత్తనాలు విత్తడానికి దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు.

ఎక్కడ చూసినా రైతులు వ్యవసాయ పొలాల్లోనే కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పత్తి విత్తనాలు కొనాలా వద్దా అని సందేహంలో ఉన్న రైతులు వర్షం కురియడంతో విత్తన దుకాణాల బాట పట్టారు. రైతులు కావాలనుకుంటున్న యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు నేటికీ దుకాణాల్లో రాకపోవడం గమనార్హం. ఇదేమిటని రైతులు దుకాణదారులను ప్రశ్నిస్తే ఆ విత్తనాలు రావడం లేదని వేరే విత్తనాలు ఉన్నాయి తీసుకెళ్లాలని సూచిస్తున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు .మరి రైతులు కోరిన విత్తనాలు ఎందుకు రావడం లేదు సంబంధిత శాఖ అధికారులు విత్తన దుకాణదారులు చెప్పాల్సి ఉంది .రైతులకు అవసరం లేని విత్తనాలు ఉన్నాయని చెబుతూ వాటిని తీసుకెళ్లాలని దుకాణదారులు సూచిస్తున్నారు .

కొంతమంది తుంగతుర్తి ప్రాంత రైతులు గుంటూరుకు వెళ్లి విత్తనాలు తెచ్చుకోవడం మరికొంతమంది ఇతర ప్రాంతాల్లో విత్తనాలు తెచ్చుకుంటున్నట్లు సమాచారం .మరి తుంగతుర్తి లో ఉన్న విత్తన దుకాణాలు రైతులకు కావలసిన విత్తనాలు ఎందుకు సరఫరా చేయడం లేదు రైతులకు అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు  .తుంగతుర్తి మండలం లోని విత్తన వ్యాపారులు రైతులు కోరిన విత్తనాలు తెచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదా? లేక విత్తనాలు తెచ్చిన లోపాయగారిగా అమ్మకాలు చేస్తున్నారా ?అనేది ప్రశ్నగా మిగిలింది . పత్తి విత్తనాలు విత్తడానికి  రైతులకు ఈ వారం రోజులు ముఖ్యమైనదిగా  చెబుతున్నారు. విత్తనాలు వితే అదను పోయిన తర్వాత విత్తనాలు వచ్చిన లాభం లేదని రైతులంటున్నారు .సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే రైతుల కోరే విత్తనాలు తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని యావత్ రైతాంగం కోరుతోంది.