మెదక్ నర్సాపూర్ నేషనల్ హైవేపై రైతులరాస్తారోకో

మెదక్ నర్సాపూర్ నేషనల్ హైవేపై రైతులరాస్తారోకో

ముద్ర ప్రతినిధి, మెదక్: రీజినల్ రింగ్ రోడ్డుతో పేద రైతులకు అన్యాయం జరుగుతుంది....అలైన్మెంట్ మార్చాలంటూ నర్సాపూర్- మెదక్ నేషనల్ హైవే పై మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పెద్దల భూములను తప్పిస్తూ చిన్న, సన్నకారు రైతుల భూముల నుండి త్రిబుల్ఆర్ అలైన్మెంట్ చేశారని, ముందు చేసిన సర్వే ప్రకారమే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలంగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని, రైతులకు చెప్పకుండా సర్వేలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతుల భూములు కాకుండా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూముల నుంచి రీజినల్ రింగ్ రోడ్డు సర్వేలు నిర్వహించాలన్నారు. 

చెరువుల మధ్యలో నుంచి, ఇండ్ల నుంచి చిన్న సన్నకారు రైతుల పొలాల నుంచి సర్వే చేస్తే ఆందోళన చేపడతామన్నారు. రైతుల రాస్తారోకోతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదర్, ఎస్ఐ శివకుమార్ ఆందోళనకారులకు నచ్చజెప్పి న్యాయం జరిగేలా చూస్తామని విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా, ఎంపీటీసీ అశోక్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రామాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్, అజ్మత్, నరేష్, నర్సింలు, అశోక్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.