బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలో పియుసి 2 చదువుతున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన స్వాతి ప్రియ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. వ్యక్తిగత కారణాలతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ట్రిపుల్ ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థికి సోమవారం ఉదయమే పరీక్షలు ఉన్నాయి. పరీక్షల రోజే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్యకు కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
విద్యార్థిని మృతితో ట్రిపుల్ ఐటీ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈవిషయాన్ని విద్యార్థిని కుటుంబసభ్యులకు ట్రిపుల్ ఐటీ అధికారులు సమాచారాన్ని చేరవేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. మృతదేహాన్ని ముందుగా ట్రిపుల్ ఐటీ లో గల ఆస్పత్రికి తరలించారు. అయితే వెంటనే ట్రిపుల్ ఐటీ అంబులెన్స్ లో విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ హైదరాబాద్ లో ఉండడంతో ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన ట్రిపుల్ ఐటీకి వస్తున్నట్టు సమాచారం.