జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకుల అరెస్టు

జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకుల అరెస్టు
  • 10 కిలో గంజాయి, రెండు బైక్ లు, సెల్ ఫోనులు సీజ్ 
  • వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను వేరు వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా  పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. రాయికల్ పట్టణ శివారులో జగిత్యాల డిఎస్పి రఘు చందర్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ ఆరిఫ్ అలీఖాన్, ఎస్సై అజయ్ లు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాయికల్ కు చెందిన పెనుగొండ గణేష్, రాయికల్ మండలం లాల్య నాయక్ తండ గ్రామానికి చెందిన మాలవత్ సతీష్ కుమార్ లు బైక్ పై ఇటిక్యాల వైపు వెళ్తుండగా  పోలీసులు సోదాలు చేయగా వారి వద్ద కాలేజ్ బ్యాగులో 6 కిలోల ఎండు గంజాయి లభించింది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు బైక్ సీజ్ చేశారు. అలాగే మల్లాపూర్ మండలం రేగుంట, గొర్రెపల్లి మధ్య మెట్పల్లి డిఎస్పి ఉమా మహేశ్వర్ రావు  అధ్వర్యంలో మెట్పల్లి సిఐ నవీన్, ఎస్సై కిరణ్ కుమార్ లు  వాహనాలు తనిఖీ చేస్తుండగా మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన రావులకరి నితిన్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా  పోలీసుల సోదాల్లో  నితిన్ వద్ద నాలుగు కిలోల ఎండు గంజాయి లభించింది. దీంతో నితిన్ అదుపులోకి తీసుకొని ఆయన బైక్ సెల్ ఫోన్  పోలీసులు సీజ్ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి గంజాయి తీసుకొని పొట్లాలుగా మార్చి పలువురికి  విక్రయించే రాయికల్ మండలం కుమ్మరుపల్లికి చెందిన తోట అజయ్, ఉప్పుమడుగు చెందిన ఆవుల సాగర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా స్నేహితులని, నిందితులంతా కలిసి బర్త్డే పార్టీలు దావతులు చేసుకునేప్పుడు గంజాయి తాగే వాళ్లని ఎస్పీ పేర్కొన్నారు.   గణేష్  హైదరాబాదులో బీటెక్ చదివేటప్పుడు గంజాయి సేవించేవాడని అప్పుడే విశాఖపట్నం సీలేరుకు చెందిన గంజాయి విక్రయించే వ్యక్తి సెల్ నెంబర్ సంపాదించి, చదువు మధ్యలో మానేశాక  గంజాయి విక్రయించేందుకు సీలేరు వ్యక్తితో సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి కొనుగోలు చేసి  తెచ్చి జగిత్యాల జిల్లాలో విక్రయించేవాడని ఎస్పీ తెలిపారు.  

ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరిపి మరింత మంది నిందితులను అరెస్ట్ చేయనట్లు తెలిపారు. ఈ కేసులలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్, మెట్పల్లి సీఐలను, రాయికల్, మల్లాపూర్ ఎస్ఐలను, కానిస్టేబుల్ సంతోష్, ప్రశాంత్, సుమన్, కిరణ్, పి . సంతోష్ , సురేష్ లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో, ఏఎస్పి శివం ఉపాధ్యాయ, జగిత్యాల, మెట్పల్లి  డిఎస్పిలు  రఘు చందర్, ఉమామహేశ్వరరావు, సిఐలు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.