ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికా చరిత్రలోనే తొలిసారి మహిళకు కీలక పదవి
అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. తన పాలనా యంత్రాంగాన్ని నియమించుకుంటున్నారు. తాజాగా, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిలో మహిళను నియమించారు. తన క్యాంపెయిన్ మేనేజర్ సూసీ వైల్స్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఈ పదవిలో ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి. ‘అమెరికా చరిత్రలోనే నేను అద్భుతమైన రాజకీయ విజయం సాధించడానికి సూసీ వైల్స్ తోడ్పాడ్డారు.. ఆమె 2016, 2020 ఎన్నికల ప్రచారంలోనూ భాగస్వామిగా ఉన్నారు’ అని ట్రంప్ తెలిపారు.‘అమె ధైర్యవంతురాలు.. తెలివైనది.. వినూత్నమైనది, విశ్వవ్యాప్తంగా గౌరవింపబడే మహిళ’ అని కితాబిచ్చారు.
‘యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీని నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం తర్వాత చేసిన మొదటి ప్రసంగంలోనూ సూసీ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఆమెను ‘ఐస్ బేబీ’ అంటూ తెర వెనుక ఉండానికి ఇష్టపడతారని అన్నారు.సూసీ నియమాకంపై వైస్-ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జేడీ వాన్స్ హర్షం వ్యక్తం చేశారు. చాలా గొప్ప న్యూస్ అని, ట్రంప్ క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించారని అన్నారు. ‘ఆమె వైట్‌హౌస్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తారు.. నిజంగా ఆమె చాలా మంచి వ్యక్తి’ అన్నారు.ఫ్లోరిడాకు చెందిన రాజకీయ వ్యూహకర్త అయిన సూసీ వైల్స్.. 1957 మే 14న జన్మించారు.
ఆమె తండ్రి అమెరికాలో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ప్యాట్ సుమ్మెరల్. ట్రంప్ క్యాంపెయిన్‌కు ముందు గతంలో 1980 నాటి ఎన్నికలప్పుడు రోనాల్డ్ రీగన్ ప్రచార బృందంలో ఉన్నారు. అలాగే, 2018 ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా ఎన్నికైన రిపబ్లికన్ నేత రాన్ డెసెంటిస్ గెలుపులో కీలక భూమిక పోషించారు. అంతకు ముందు అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన జాక్ కెంప్, టిల్లీ ఫౌలర్‌ల కోసం పనిచేశారు. అలాగే, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ఉటా మాజీ గవర్నర్ జాన్ హుంట్‌స్మన్ జూనియర్‌కు మేనేజర్‌గా ఉన్నారు. ఇక, 2016, 2020 ఎన్నికల్లో ట్రంప్ బృందంలో సీనియర్ సలహాదారుగా సేవలు అందించారు.