కలెక్టర్ భవనంకు అనువుకాని స్థలంలో మాతా శిశు ఆసుపత్రిని ఎలా నిర్మించారు

కలెక్టర్ భవనంకు అనువుకాని స్థలంలో మాతా శిశు ఆసుపత్రిని ఎలా నిర్మించారు
  • ఎమ్మెల్యే తీరును తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :మంచిర్యాల లోని గోదావరి తీరమున కలెక్టర్ కార్యాలయం భవనం నిర్మాణం కు అనువుకాని స్థలంలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఎలా నిర్మించారని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే దివాకర్ రావును ప్రశ్నించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయం కోసం స్థలం పరీశీలించిన ఆర్ అండ్ బీ అధికారులు అక్కడ గోదావరి ఉప్పొంగి తే నీట మునుగుతుందని నివేదిక ఇచ్చారని తెలిపారు. అదే స్థలంలో నీట మునుగితుందని తెలిసినా ఉద్దేశ్యపూర్వకంగా ఆసుపత్రి నిర్మించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ లో భట్టి విక్రమార్క ఆసుపత్రి గురుంచి ప్రస్తావిస్తే శంఖుస్థాపన సమయంలో తాను ఎమ్మెల్యేగా లేనని పచ్చి అబద్ధాలు చెప్పడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే గా లేకపోయినప్పటికీ స్థానికుడిగా గోదావరి ఎన్నిసార్లు వచ్చి ఎక్కడి వరకు వచ్చాయో తెలియదా?  అక్కడ నిర్మాణం వద్దు అని ఎందుకు  అడ్డుకోలేదని నిలతీశారు. మళ్లీ మాతా శిశు ఆసుపత్రిని ఆభవనంలో  నిర్వహించవద్దని సూచించారు. వరద బాధితులు గోడు చెప్పుకోవడానికి వెళితే ఎందుకు ఇండ్లు కట్టుకున్నారని ప్రశ్నించడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే ఇంటి వరకు నీళ్లు వచ్చాయని ఆయన కూడా ఆ ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నారని అన్నారు. రైతులకు బ్యాంకులలో రుణమాఫీ ప్రకటన వెనుక కాంగ్రెస్ ఉద్యమం ముమ్మాటికీ ఉందన్నారు. రైతురుణ మాఫీ ప్రకటన జాప్యం వల్ల రైతులకు అప్పు పెరిగి ఆర్ధిక భారం పడిందని తెలిపారు. 

  • దేశంలో  ఎక్కడా అండర్ బ్రిడ్జిలకు గేటు ఉండదు 

దేశంలో ఎక్కడా రైల్వే అండర్ బ్రిడ్జిలకు గేటు ఉండదని మంచిర్యాల లో మాత్రమే ఉందని ఎద్దేవాచేశారు. నిర్మాణం లోపం వల్ల వర్షం పడితే నీళ్లు చేరితే రాకపోకలు నిలిచిపోతాయని అన్నారు. నీళ్లు నిలిస్తే గేట్లు వేస్తారని తెలిపారు. ప్రధాన చౌరస్తాల వద్ద నిర్మిస్తున్న సర్కిల్ ల సైజ్ తగ్గించాలని సూచించారు. పెద్దగా నిర్మించడం వల్ల రహదారి చిన్నగా మారి ప్రమాదవశాత్తు ఓయువకుడు ఢీకొని మృతి చెందాడని తెలిపారు. యువకుని మృతికి భాద్యులను చేస్తూ కాంట్రాక్టర్, అధికారులపై కేసు పెడతామని చెప్పారు. ముల్కళ్ల గ్రామానికి చెందిన బీఆరెస్, బీజేపీ లకు చెందిన 40 మంది కాంగ్రెస్ లో చేరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇతర నేతలు పాల్గొన్నారు.