కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ విచారణ జరపాలి - మాజీ ఎంపీ వివేక్ 

కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ విచారణ జరపాలి  - మాజీ ఎంపీ వివేక్ 

ముద్ర, ప్రతినిధి,మంచిర్యాల : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని సీబీఐ విచారణ జరిపించి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల లో ఇటీవల వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కేసీఆర్, మేఘా కంపెనీ కాంట్రాక్టర్ మాత్రమే లాభ పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం రైతులకు మేలు చేయకపోగా వర్షాకాలంలో వేలాది ఎకరాల పంటను ముంచుతుందని అన్నారు. తుమ్మిడీహెట్టి వద్ద 36 వేల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టగా అక్కడ కాదని కమీషన్లకు కక్కుర్తిపడి అనాలోచిత నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని విమర్శించారు.   కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మంచిర్యాల, చెన్నూర్, మంథని, భూపాలపల్లి నియోజకవర్గాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. మంచిర్యాల లో రాళ్ళవాగుపై కరకట్ట కట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • కేటీఆర్ కు అవార్డు ఎలా ఇచ్చారో

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఉత్తమమైందని మంత్రి కేటీఆర్ కు అమెరికాలోని ఓ సంస్థ అవార్డు ఇవ్వడం విచిత్రంగా ఉందని వివేక్ అన్నారు. పంటలు, ఇండ్లు కాళేశ్వరం వల్ల ముంపుకు గురవుతున్నందుకు ఇచ్చారా ? అని సందేహం వ్యక్తం చేశారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ రావు ఇతర నేతలు పాల్గొన్నారు.