స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ది అలుపెరగని పోరు

స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ది అలుపెరగని పోరు

  • మహాత్మా గాంధీ పేరు వింటేనే తెల్ల దొరలకు హడల్
  • మహాత్మా గాంధీ కృషితోనే గ్రామ స్వరాజ్యం
  • గాంధీ ఆశయ సాధనకు పునరంకితం కావాలి
  • ప్రతి గ్రామంలో గాంధీ విగ్రహం తప్పక ఉండాలి
  • అన్ని స్థాయిల విద్యార్థులకు గాంధీ జీవితం పాఠ్యాంశంగా  చేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి విన్నవిస్తా
  • మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెల్ల దొరల నుంచి భారతమాత దాస్య శ్రుంకలాలను ఛేదించడానికి మహాత్మా గాంధీ అలుపెరగని పోరు చేశాడని, ఆ మహాత్ముని కృషివల్లనే నేడు మనందరం ప్రశాంతంగా స్వేచ్ఛ, సమానత్వంతో జీవిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుడ కుడ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల లేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ పేరు చెబితేనే తెల్ల దొరలకు హడల్ అని, గ్రామ స్వరాజ్యం గాంధీతోనే సాధ్యమైందని వివరించారు. ప్రతి ఒక్కరూ గాంధీ ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.గాంధీ అందించిన వారసత్వాన్ని అందిపుచ్చుకొని భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసి జవహర్ రోజ్ గార్ యోజన పథకం ద్వారా గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే మధ్యలో ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా నిధులను అందించిన సంగతి మన అందరికీ తెలిసినదే అన్నారు.

గాంధీ జీవితాన్ని, ఆయన పోరాట చరిత్రను కేజీ నుంచి పీజీ వరకు అన్ని స్థాయిల విద్యార్థులు తెలుసుకునే విధంగా పాఠ్యాంశాలలో చేర్చాలన్న విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి వర్గమును కలిసి చర్చించనున్నట్టు ఆయన చెప్పారు. నాడు దేశంలో ఉన్న రాజకీయ విలువలకు, నేటి రాజకీయ విలువలకు చాలా భేదాలు ఉన్నాయని,  విలువలతో కూడిన రాజకీయాలు నాడు ఉండేవని, నేటి తరానికి అలాంటివి లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు మహాత్ముడు చేసిన త్యాగం ఫలితంగా నేడు మనందరం స్వేచ్ఛ, స్వాతంత్రాలతో సుభిక్షంగా ఉన్నామని వివరించారు. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ కీలకంగా వ్యవహరించి దేశానికి స్వాతంత్రం రావడంలో అమోఘమైన పాత్రను పోషించారన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ మహాత్మ గాంధీ విగ్రహం తప్పకుండా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా గాంధీ విగ్రహాలు అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు ఆయన చెప్పారు. చివరకు గాడ్సే చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్,ఆర్యవైశ్య యువజన నాయకులు మీలా వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజద్ అలీ, బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు బండారరు రాజా, గుండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.