అత్సుత్సాహం ప్రదర్శించొద్దు ... ఆలోచించి అడుగుపెట్టండి
- సంగారెడ్డి సెగ్మెంట్ ప్రజలను ఇబ్బందిపెడితే తీవ్ర పరిణమాలు
- ఏదైనా ఉంటే ముందు నాతో మాట్లాడండి
- అవసరమైతే సీఎంతో నేను మాట్లాడుతా
- హైడ్రాకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆల్టీమేటం
ముద్ర, తెలంగాణ బ్యూరో : చెరువులు, కుంటల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలకు దిగుతోన్న హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైడ్రా అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సోమవారం పలు సూచనలు చేశారు. అక్రమ నిర్మాణాల పేరిట సంగారెడ్డి నియోజకవర్గంలో నోటీసులు, కూల్చివేతల వంటి చేష్టలకు దిగొద్దన్న తన ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేతలు ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రమే ఉంటాయనీ, రింగ్ రోడ్డు బయట హైడ్రా యాక్షన్ ఉండదని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే సంగారెడ్డి నియోజకవర్గం ఔటర్ రింగ్ రోడ్డుకు బయట ఉంటుందని,అందుకే తన నియోజకవర్గంలో కూల్చివేతలు ఉండకూడదన్నారు. ఒకవేళ తన నియోజకవర్గంలో ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కానీ ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు ఉంటాయని ప్రచారం జరుగుతుందన్న ఆయన అధికారులెవరూ అత్సుహ్సాయం ప్రదర్శించొద్దని హెచ్చరించారు. ఒకవేళ అలాంటి చర్యలు, నిర్ణయం ఏదైనా ఉంటే హైడ్రా అధికారులు ముందుగా చర్చించాలన్నారు. ఈ విషయంపై తాను సీఎంతో మాట్లాడతానని జగ్గారెడ్డి చెప్పారు.