గ్రామీణ యువత కు సేంద్రీయ వ్యవసాయంపై ఉచిత శిక్షణ

గ్రామీణ యువత కు సేంద్రీయ వ్యవసాయంపై ఉచిత శిక్షణ

ముద్ర .వనపర్తి:- కొత్తకోట మండలం మదనాపురంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నైపుణ్య భారత్ లో భాగంగా గ్రామీణ యువతకు మరియు యువ రైతులకు సేంద్రీయ వ్యవసాయ సాగుపై 25 రోజులపాటు వ్యవసాయ నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శిక్షణ నిర్వాహకుడు సీనియర్ శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ రెండో వారం నుండి ప్రారంభమయ్యే శిక్షణకు జిల్లాలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు కనీసం ఆరవ తరగతి చదివి 18 నుండి 40 సంవత్సరాలు కలిగి ఉండాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో ఉచిత భోజనం మరియు వసతి కల్పించడం జరుగుతుందని ఆసక్తి కలిగిన గ్రామీణ యువ రైతులు మరియు యువత ఈనెల తొమ్మిదో తేదీలోపు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటో, చదువు ధ్రువీకరణ పత్రం లేదా మార్కుల పత్రం జిరాక్స్ పత్రాలతో కృషి విజ్ఞాన కేంద్రం మదనాపురం నందు పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.

శిక్షణ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సుస్థిర వ్యవసాయ సాగు పద్ధతులు, భూసార సంరక్షణ పద్ధతులు, సమగ్ర పోషకాల యాజమాన్యం, సేంద్రియ ఎరువుల వర్మి కంపోస్ట్ తయారీ, పచ్చి రొట్టె ఎరువులు, జీవన ఎరువులు, సమగ్ర సస్యరక్షణ, జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రసాయనల తయారీ, వృక్ష సంబంధిత మందుల తయారీ, సేంద్రీయ ఉత్పత్తులు, మార్కెటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చి సేంద్రియ వ్యవసాయ క్షేత్ర సందర్శన ఏర్పాటు చేయడం జరిగిందని సీనియర్ శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని యువత యువ రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.