భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు 

భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు 
  • కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మికసంఘాలు రేపు చేపట్టబోయే భారత్ బంద్  కు  కార్మిక సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, బంద్ లో కార్మికలు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ కోరారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఎంఎస్‌పిపై కొనుగోలుకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలని, రైతులకు రుణమాఫీ పథకం అమలు చేయాలని, ఎంఎన్‌ఆర్‌ఈజిఎ కింద 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ. 600 వేతనం ఉండాలని  పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే భూసేకరణ చట్టం 2013ని సమగ్రంగా అమలు చేయాలని, భూసేకరణ, భూ కార్పొరేటీకరణను నిషేధించాలని అన్నారు.

లఖింపూర్‌ ఖేరీలో నలుగురు రైతులను, జర్నలిస్టును వాహనంతో హత్య చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తేనీని బర్తరఫ్‌ చేసి అరెస్ట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలి. 4 కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి. రైల్వేలు, రక్షణ, విద్యుత్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలి. ఉద్యోగాల్లో కాంట్రాక్టు వ్యవస్థను నిలిపివేయాలి. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి. సంఘటిత, అసంఘటిత కార్మికులందరికీ పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించాలి. కార్పొరేట్‌, మతోన్మాద ప్రభుత్వం రైతులు, కూలీలపై చేస్తున్న దాడులను ఆపాలి. రైతుల పంటలను ధ్వంసం చేసే జంతువుల నివారణకు ఏర్పాట్లు చేయాలి. పాలు లీటరుకు రూ.50 కనీస మద్దతు ధరగా ప్రకటించాలి. కూరగాయలు, పండ్లు, అన్ని పంటలకు కూడా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయాలి. కరెంటు కోతలు అరికట్టాలి, బిల్లుల మోసాలు అరికట్టాలి, కరెంటు ప్రైవేటీకరణ చేయకూడదు. ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు భూమిని ఇవ్వాలి” అన్నారు. ఈ డిమాండ్ల సాధన కొరకు జాతీయ సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని శ్రామిక వర్గాన్ని పినపాక ప్రభాకర్  కోరారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా నాయకులు బంటారం సుధాకర్ గౌడ్, డివిజన్ నాయకులు రాజేష్, టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ డివిజన్ కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, సెంట్రింగ్ యూనియన్ నాయకులు అంజయ్య యాదవ్, నాట్కో ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.