కాంగ్రెస్ గూటికి గుత్తా కుటుంబం

కాంగ్రెస్ గూటికి గుత్తా కుటుంబం
  • భువనగిరి పార్లమెంటు సీటు అమిత్ రెడ్డికి కేటాయించే అవకాశం
  • సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ కోర్టుగా ప్రచారం మనస్థాపనతో గుత్తా ఫ్యామిలీ
  • ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చలు

ముద్ర ప్రతినిధి నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డికి ఆశించినంతగా టికెట్ దక్కలేదు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో మునుగోడుతో పాటు నల్గొండ నుంచి ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు, తగిన ఫలితం దక్కలేదు. మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వీరికి టికెట్ రాకుండా అడ్డు పడ్డారని గతం నుండి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన జగదీశ్ రెడ్డి మాత్రం అడ్డుపడుతున్నట్లు గుత్తా ఫ్యామిలీని చెప్పి చెప్పినట్లుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపడటానికి ఎంత కష్టపడి పనిచేస్తున్న గాని సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీ కోవర్టు అని ప్రచారం చేయడం ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం ఎంపీ అభ్యర్థిగా నేను పోటీలో లేనని ప్రకటన చేయడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయమైంధి.

నమ్మకం లేని చోట ఉండి పని చేయ్యలేమనే నిర్ణయంతో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, మాజీ మంత్రి జానారెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. వారి పూర్తి మద్దతు వారికే ప్రకటించినట్లు గుత్తా కుటుంబ సన్నిహితులు తెలుపుతున్నారు. గుత్తా అమిత్ రెడ్డికి భువనగిరి పార్లమెంటు స్థానంలో అవకాశం ఇవ్వాలని కీలక నేతలతో అమిత్ రెడ్డి విన్నవించుకున్నట్లు సమాచారం. గుత్తా సుఖేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లతో దగ్గర సంబంధాలు ఉండడం, సీఎం రేవంత్ రెడ్డితో బంధుత్వం అమిత్ రెడ్డికి ఎంపీ సీటు కలిసి రావచ్చని గుత్తా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్గొండ నుండి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన గుత్తా ఆ తర్వాత బిఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన మండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలతో చర్చలు జరిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి, తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే నల్గొండ ఎంపీ సీటు మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. ఏది ఏమైనా త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి ఎంపీ టికెట్ పై క్లారిటీ ఇవ్వనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుత్తా మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు అమిత్ రెడ్డి చేపట్టారు. ఆయనకు ఎంపీ టికెట్ కేటాయిస్తే అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని గుత్త అభిమానులు అభిప్రాయపడుతున్నారు.