బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ల మధ్య గ్యాంగ్‌ వార్‌

బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ల మధ్య గ్యాంగ్‌ వార్‌

విజయవాడ: నగరంలోని టూటౌన్‌ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి సేవించే రెండు బ్లేడ్‌ బ్యాచ్‌ల మధ్య గ్యాంగ్‌ వార్‌ తలెత్తింది.  గురువారం రాత్రి గని అనే బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యుడికి, ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉండి వీరంగం వేస్తున్న గని బ్యాచ్‌ సభ్యుడిని పట్టుకొని హరి బ్యాచ్‌ సభ్యులు పోలీసులకు అప్పగించారు. పోలీసులకు అప్పగించారనే కక్ష పెంచుకొని హరి బ్యాచ్‌ సభ్యులపై గని బ్యాచ్‌ దాడికి పాల్పడింది.

ఆంజనేయ వాగు సెంటర్‌ కొండ ప్రాంతంలో గని బ్యాచ్‌ సభ్యుడైన అఖిల్‌ మరో ఆరుగురు యువకులతో కలిసి శుక్రవారం అక్కడికి చేరుకుని బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అఖిల్‌, శ్రీను తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాంగ్‌ వార్‌ బహిరంగంగా జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.