ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బాలిక మృతి.

ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బాలిక మృతి.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి జరిగింది.శనివారం  కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది. ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.


ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపి,కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి :   ఆవుల నాగరాజు

భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థులు భవ్య ,వైష్ణవి ల ఆత్మహత్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి,రోజులు గడవక ముందే సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల కళాశాలలో లో మరొక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని, విద్యార్థుల మరణాలపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(పిడిఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు డిమాండ్ చేశారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఎన్నో ఆశలతో విద్యాలయాలకు అడుగుపెడుతున్న విద్యార్థులు విగత జీవులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి ని హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, తక్షణమే విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలని నాగరాజు డిమాండ్ చేశారు.


ఆత్మహత్య కేంద్రాలుగా మారుతున్న గురుకులాలు 


 ఇమాంపేట  ఎస్సీ గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలి : ఎస్ఎఫ్ఐ

ఆత్మహత్య కేంద్రాలుగా గురుకులాలు మారుతున్నాయని, ఇమాంపేట ఎస్సీ గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ జిల్లా నాయకురాలు  జయంతి, నందిని లు డిమాండ్ చేశారు. ఆదివారం పాఠశాల ముందు, జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి మృతి పట్ల చాలా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఫేర్వెల్ పార్టీలో చాలా యాక్టివ్ గా  పాల్గొన్న విద్యార్థిని, శనివారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడింది అన్నారు. అంతలోనే ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగానే తల్లిదండ్రులకు కానీ పోలీసుల గాని సమాచారం ఇవ్వకుండా  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం ఏంటని వారు ప్రశ్నించారు.  పాఠశాలలో జరుగుతున్న సమస్యల మీద వైష్ణవి పలు సందర్భాల్లో ప్రశ్నించింది అన్నారు. అవి సిబ్బంది మనుసు లో పెట్టుకున్నారనే సందేహాలు లేవనెత్తుతున్నారని, గురుకులాలు తరచూ ఆత్మహత్యలు జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ సి ఓ, డి సి ఓ లు, గురుకులాలను సందర్శించి  విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడంలో విఫలమయ్యారన్నారు. ఏసీ గదులని విడిచి ఒక్కరు కూడా గురుకులాలను సందర్శించడం లేదన్నారు. విద్యార్థినిల ఆత్మహత్యలు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. వైష్ణవి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేష్యా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.


ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్ అక్రమ అరెస్ట్ 

విద్యార్థిని వైష్ణవి మృతి పట్ల సమగ్ర విచారణ చేయాలని  శాంతియుతంగా పాఠశాల గేటు ముందు ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్ కుమార్, నాయకులను అక్రమంగా అరెస్టు చేసి చివ్వేoల పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. స్టేషన్లో పోలీసులు నాయకుల పట్ల దుర్భాషలాడడాన్ని ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈ విషయంపై ప్రతి ఒక్కరు స్పందించి ఖండించాలని వారు కోరారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అక్కనపల్లి వినయ్, తాళ్ల వినయ్, అఖిల  వనిత సౌజన్య గోపి అజయ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.