ఆత్మ విశ్వాసం ముందు అంగ వైకల్యం బలాదూర్

ఆత్మ విశ్వాసం ముందు అంగ వైకల్యం బలాదూర్
  • బహుముఖ ప్రజ్ఞాశాలి నూర్ ఖాన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా జీవించటం భారంగా మారుతున్న నేటి సమాజంలో అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ పదుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నూర్ ఖాన్. ఆడ, మగ గొంతుకలతో పాటలు పాడటం, హావ భావాలతో నాట్యం, మిమిక్రీ, నటనలతో రాణిస్తున్నారు.తాను ప్రదర్శనల ద్వారా సంపాదిస్తున్న కొద్దిపాటి ఆదాయంలో అనాధలు, వికలాంగులకు కూడా సేవ అందిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మహ్మద్ నూర్ అలీ ఖాన్ కు తన ఐదు నెలల వయసులోనే పోలియోతో చచ్చుపడి పోయాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్న తరుణంలోనే పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం ఇంటర్ తప్పారు. అప్పటికే కళ పట్ల అభిరుచి ఉన్న ఖాన్ ఇంట్లోనే పాటలు పాడటం నేర్చుకున్నారు. సినీ హీరోల హావభావాలు, మేనరిజమ్స్ నేర్చుకుని కాళ్ళు లేకపోయినా కేవలం శరీరం పై భాగంతోనే నాట్యం చేస్తూ ప్రదర్శనలను ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ల హావభావాలు, మేనరిజమ్, డాన్స్ ల్లో ఒదిగిపోతారు. ఒకరిద్దరు సహాయకుల తోడ్పాటుతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో దాదాపు 800 కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. స్టేజి పై మగ, ఆడ గొంతుకలతో పాటలు పాడుతున్న సమయంలో పాట పాడకుండా ప్రజలను మోసగిస్తున్నానని కొందరు అన్నారని తెలిపారు. అపుడు సంగీతం లేకుండా పాడి వినిపించవల్సి వచ్చిందని తెలిపారు. తన వంటి వికలాంగులకు చేయూత ఇచ్చేందుకు మదర్ థెరీసా వికలాంగుల ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. తనకు వస్తున్న డబ్బులో కొంత భాగం పేదలు, అనాధలు, వికలాంగులకు వెచ్చిస్తూ పలు రకాలుగా సేవ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ రోడ్డు పక్కన ప్రదర్శనలు ఇస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నూర్ ఖాన్ ప్రదర్శనలను చూసిన పలు సంస్థలు ఈయనను సత్కరించాయి. 

వికలాంగులకు చేయూత ఇవ్వాలి 

వికలాంగులకు, వికలాంగ కళాకారులకు ఆదరణ కొరవడుతోందని నూర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రదర్శనలు ఇస్తున్నా మైక్ సెట్ అద్దె, సహాయకుల వేతనాలు,రవాణా వ్యయం పోగా మిగిలే మొత్తం జీవనానికి సరిపోవటం లేదని అన్నారు. ఎవరైనా దాతలు తోడ్పాటు ఇస్తే వికలాంగులకు, అనాధలకు మరిన్ని కార్యక్రమాలు చేపడతానని అన్నారు.తన ప్రదర్శనలకు, సహాయ కార్యక్రమాలకు తోడ్పడే వారు 9959863361 కు సంప్రదించవచ్చని కోరారు.