ప్రపంచ గమనం రక్షణ రంగానికి ఆరక్షణ

ప్రపంచ గమనం రక్షణ రంగానికి ఆరక్షణ

అంతర్గత భద్రత, సరిహద్దు ఘర్షణలు, విభేదాల కారణంగా చాలా వరకు దేశాలు తమ తమ రక్షణ శాఖలకు అధికంగా నిధులను వెచ్చిస్తున్నాయి. భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఉక్రెయిన్– రష్యా యుద్ధం, ఉత్తర కొరియా మధ్య సరిహద్దు వివాదం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్, సిరియా లాంటి దేశాలలో అంతర్గత ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఇంకా ఎన్నో సంఘటనలు ప్రపంచ దేశాలలో కనిపిస్తున్నందున ఆయా దేశాలు రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవసరం ఏర్పడింది. నిరుడు బడ్జెట్ కేటాయింపులలో అమెరికా 38 శాతం నిధులను రక్షణ శాఖకు కేటాయించింది. దాదాపు 801 బిలియన్ డాలర్లను కేటాయించింది. చైనా తన రక్షణ రంగానికి 293 బిలియన్ డాలర్లను కేటాయించింది.

భారతదేశం నిరుడు తన రక్షణ రంగానికి 77 బిలియన్ డాలర్లను కేటాయించింది. యునైటెడ్ కింగ్ డమ్ 68 డాలర్ బిలియన్ డాలర్లను, రష్యా 66 బిలియన్ డాలర్లను, పాకిస్తాన్ చాలా తక్కువగా 11 బిలియన్ డాలర్లను తమ తమ రక్షణ శాఖలకు కేటాయించాయి. భారతదేశం తమ 2023–24 బడ్జెట్లో దాదాపు 594 లక్షల కోట్లను కేటాయించింది. వీటిని లో సిబ్బంది పెన్షన్లకు, సరిహద్దు, అంతర్గత కార్యక్రమాలలో పాల్గొంటున్న సీఆర్ పీఎఫ్ కు, బార్డర్ సెక్యూరిటీకి, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్, నావికా దళానికి వినియోగించనున్నారు. అయితే, భారత రక్షణ రంగానికి ఈ నిధులే కాకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచీ, రోడ్లు భవనాల శాఖ నుంచీ నిధులు అందే అవకాశం ఉంది.  హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి సరిహద్దులో బార్డర్ కనెక్టివిటీని పెంచడానికి రోడ్ల నిర్మాణాలకు నిధులను కేటాయించారు. విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి భూటాన్ కు2,400 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులలో సింహభాగం భూటాన్ దేశంలో మౌలిక వసతులు పెంచడానికి, భూటాన్–భారత సరిహద్దులలో రాకపోకల అవకాశాలను సులభతరం చేయడానికి వినియోగిస్తారని తెలిసింది.

పెద్దన్న పాత్రను పోషిస్తూ
ఇంకా భారతదేశం పెద్దన్న పాత్రను పోషిస్తూ అఫ్ఘానిస్తాన్ కు కూడా 200 కోట్ల నిధులను కేటాయించింది. నేపాల్ కు 560 కోట్లు, మాల్దీవులకు 460 కోట్లు, మయన్మార్ కు 400 కోట్లను కేటాయించారు. ఈ నిధుల ద్వారా ఆయా దేశాలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాయి. దీంతో మనకు వారితో సుహృద్భావ వాతావరనం ఏర్పడే అవకాశం ఉంది. భారతదేశానికి నిరంతరం చైనా నుంచి ఏర్పడుతున్న ముప్పు,  పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ఉగ్రవాద కార్యక్రమాలు, ఉగ్రవాదుల చొరబాట్లు, కాశ్మీర్ సమస్య కారణంగా రక్షణ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసి వస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ రక్షణ శాఖ కు సరిపోవడం లేదని మరిన్ని నిధులు అవసరం ఉంటుందని మీడియా ద్వారా తెలుస్తున్నది. ఆయుధాల కొనుగోలు, ఆయుధాల  విడిభాగాల కొనుగోలుకు ఎక్కువ నిధులు అవసరం ఉంది. అంతర్గతంగా ఉగ్రవాద పోరును ఎదుర్కోవడానికి మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుంటుందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇంకా నిధులు కావాలి
రక్షణ శాఖకు కేటాయించిన నిధులలో మెజారిటీ శాతం సిబ్బంది వేతనాలకు, పెన్షన్లకు ఇవ్వవలసి ఉంటుంది. వీటన్నింటినీ గమనించి, దేశ రక్షణ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ శాఖకు మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుంటుంది. ఈ  యేడాది సెప్టెంబర్ లో జరగబోయే జి–20 శిఖరాగ్ర సదస్సుకు కూడా కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల నిధులను కేటాయించింది. వీటిలో కూడా కొన్ని నిధులు రక్షణ రంగానికి ఉపయోగపడే అవకాశం ఉంది. జి–20 సదస్సు విజయవంతం చేయడం ద్వారా భారతదేశ ప్రతిష్ట మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో జి–20 అధ్యక్ష హోదాలో దేశం తరఫున  పలు నగరాలలో చిన్న చిన్న చర్చా గోష్ఠులు, సమావేశాలు జరుగుతున్నాయి. శిఖరాగ్ర సదస్సుకు ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరవుతారు కాబట్టి వారి రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఇందుకోసం కూడా ప్రత్యేక నిధులు అవసరం. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆ శాఖకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి. ఆయుధాల కొనుగోలుకు బడ్జెట్ లో అవసరమైనంత కేటాయించడం ద్వారా సరిహద్దులలో ఉండే ప్రజానీకం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. 

శ్రీనర్సన్ 
జర్నలిస్టు, కాలమిస్ట్
83280 96188