శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన నిమిషాంబికా దేవి
బోడుప్పల్, ముద్ర : శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు బోడుప్పల్ లోని పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న మాతా నిమిషాంబికా దేవి అమ్మవారు డోలాసుర సంహారిణి, సర్వమంగళకారణి అయిన శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వెలుగు దివ్వెల కాంతులలో మహోజ్జ్వలంగా ప్రకాశిస్తూ భక్తులకు ఐశ్వర్య ప్రదాయినిగా ఆ తల్లి అభయమిచ్చారు. కమలాలను చేతులలో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మన్మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిచ్చారు. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి అమ్మవారు. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళకారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుందన్నది భక్తుల నమ్మకం. "యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"... అంటే అన్ని జీవులలోనో ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. మహాలక్ష్మీ అలంకారంలో ప్రకాశిస్తున్న నిమిషాంబికా అమ్మవారి దర్శనానికి ఉదయం 7 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలయ్యింది. భక్త జనసందోహానికి ఏవిధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు కొరిచెర్ల శ్రీనివాస రావు, అశోక్ కుమార్ తదితరులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, యువ అర్చకుడు చంద్ర ప్రకాశ్ తదితరులు భక్తులతో పూజాదికాలు నిర్వహింపచేశారు.