తిరుమల సాధారణ భక్తులకు గుడ్​ న్యూస్

తిరుమల సాధారణ భక్తులకు గుడ్​ న్యూస్
  • వేసవిలో వీఐపీ బ్రేక్​ దర్శనాలు బంద్​
  • రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

ముద్ర, ఏపీ :వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు సైతం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు గాను వచ్చే మూడు నెలలపాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశం హాల్‌లో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు కల్పించడానికి సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాన్ని రద్దు చేసినట్లు వివరించారు. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లు, బయట లైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, స్నాక్స్ , వైద్య సదుపాయాలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు. మాడ వీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు. వేసవి రద్దీ సమయంలో భక్తులకు సహాయం అందించేందుకు స్కౌట్స్, గైడ్స్‌తోపాటు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించామని తెలిపారు. వేసవి వేడి రోజులలో శేషాచల అటవీ ప్రాంతాల్లో ఫ్లాష్ అగ్ని ప్రమాదాలను నివారించడానికి టీటీడీ అటవీ శాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.