ప్రభుత్వ డాక్టర్లు V/S ప్రైవేట్ డాక్టర్లు
- ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ఓపీ చిట్టీలు ఇవ్వడం లేదని ఆరోపణ
- వారికి అనుకూలమైన ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నట్లు ఆరోపణ
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : ఏన్సాన్‌పల్లి శివారులోని సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో పని చేస్తున్న ప్రభుత్వ దంత డాక్టర్లపై సిద్దిపేటలోని ప్రైవేటు ఆసుపత్రుల దంత వైద్యులు పలు ఆరోపణలు చేశారు. ఎవరైనా పెషేంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాసుపత్రిలోని డెంటల్ విభాగంలో చికిత్స కోసం వెళితే వారు పరీక్షించి, చికిత్స అందించి, మందులు అందజేస్తారు. ఒకవేళ అక్కడ అందుబాటులో లేని చికిత్స కోసం హైయ్యర్ సెంటర్లకు వైద్యులు రిఫర్ చేస్తారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటే వారికి ఈహెచ్‌ఎస్ కింద బిల్లులు రియింబర్స్‌మెంట్ రావాలంటే వారు ముందుగా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించినట్లు ఓపీ చిట్టిపై ఆసుపత్రి సీల్ వేసి తీసుకవెళ్లాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలోని డెంటల్ విభాగ వైద్యులు ప్రభుత్వ ఉద్యోగులు చికిత్స కోసం వెళితే అక్కడ చూపించుకున్నట్లు వైద్యులు ఓపీ చిట్టీలు ఇవ్వడం లేదని, తమ దగ్గరనే పెట్టుకుంటున్నారని, అదే విధంగా తమకు కమీషన్ ఇచ్చే ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వాసుపత్రి డెంటల్ విభాగ వైద్యులు పెషేంట్లను రిఫర్ చేస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రుల దంత వైద్యులు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి డెంటల్ విభాగ వైద్యులను అడిగారు.
దీంతో ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీ టౌన్ పోలీసులు ప్రభుత్వాసుపత్రికి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వాసుపత్రి డెంటల్ విభాగ వైద్యులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఓపీ సేవల కోసం వచ్చే పెషేంట్లకు వారిని పరీక్షించి, మందులు రాసిన తర్వాత ఆ చిట్టీని పెషెంట్లకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు దంత వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ డీఎన్.స్వామి మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దంత విభాగంలో జరుగుతున్న సంఘటనలు తమ దృష్టికి రావడంతో ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలోని దంత విభాగంలో ఇద్దరు వైద్యులు పనిచేస్తున్నట్లు వీరిలో ఒకరు డాక్టర్ సుధీర్ కాంట్రాక్టు పద్దతిలో మరొకరు డాక్టర్ వనిత రెగ్యులర్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రెగ్యులర్‌గా విధులకు హాజరు కాకపోవడంతో పెషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దంత వైద్యం కోసం ఇంత దూరం రావడానికి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రీయింబర్స్‌మెంట్ ఉన్న ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఓపీ చిటీ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సెలవు పెట్టుకుని వారు తిరగడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు. వారికి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకు, కమిషన్ ఇచ్చే ఆసుపత్రులకు పెషేంట్లను డైవర్ట్ చేస్తున్నారని వీటన్నింటిని రాష్ట్ర దంత వైద్యుల సంఘం తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై డాక్టర్ వనితను ఫోన్‌లో సంప్రదించగా అటెండెన్స్ రిజిస్టిర్ తన కంట్రోల్‌లో లేదని, డాక్టర్ సుధీర్ కంట్రోల్‌లో ఉందని తెలిపారు. తాను రిజిస్టర్‌లో సంతకం చేయలేదని, రెగ్యులర్ ఉద్యోగిని కాబట్టి బయోమెట్రిక్ పద్దతిలో అటెండెన్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. తన డ్యూటీ సమయంలో విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఓ మహిళ ఉపాధ్యాయురాలు గత మార్చి నెలలో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిందని ఆ పెషేంట్‌కు సంబంధించిన ఓపీ చిట్టీ ఇవ్వలేదని ప్రైవేటు వైద్యుడు తనను అడిగాడని తన దగ్గర లేదని డాక్టర్ వనిత తెలిపారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తోటి సిబ్బంది తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట ప్రైవేటు ఆసుపత్రుల దంత వైద్యులు అనంత్, రాజు, స్వామి, బాలసునీల్ తదితరులు పాల్గొన్నారు.