31లోపు ధాన్యం డబ్బులు చెల్లించాలి

31లోపు ధాన్యం డబ్బులు చెల్లించాలి
  • లేకపోతే ఆందోళన లు చేస్తాం 
  • మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ఈనెలలోపు రైతులకు వరి ధాన్యం బకాయిలను చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం మంచిర్యాల లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని గొప్పగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ సుమారు యాభై శాతం మందికి ఇంకా డబ్బులు చెల్లించలేదని తెలిపారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోగా తూకంలో మోసం, ఇతర రకాలుగా మోసపోయారని ఆందోళ వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ ను వీడను 
తాను కాంగ్రెస్ పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంను ఎవరు నమ్మవద్దని ప్రేమ్ సాగర్ రావు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ప్రత్యర్ధులు తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారంకు తెర తీశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రభుత్వంలో తనకు సముచితస్థానం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు కొండ చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, బీసీ సెల్ అధ్యక్షుడు వడ్డె రాజమౌళి ఇతర నేతలు పాల్గొన్నారు.