ఇంటర్మీడియేట్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలి 

ఇంటర్మీడియేట్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలి 
  • ఇంటర్మీడియేట్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: దశాబ్దకాలంగా ఇంటర్మీడియేట్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుగా సేవలందిస్తూ, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్న గెస్ట్ లెక్చరర్లను ఈ ఏడాది కూడా రెన్యూవల్ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటర్మీడియేట్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియేట్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకంలో గతంలో పనిచేసిన వారిని పరిగణలోకి తీసుకోకుండ కేవలం మెరిట్ ఆధారంగా నియామకం చేపట్టేందుకు ఇంటర్మీడియేట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దకాలంగా పనిచేసిన 1,654మంది గెస్ట్ లెకర్చర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని అన్నారు. దశాబ్దకాలంగా పనిచేస్తున్న వారినే ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేస్తుండడంతో ఇతర ఉద్యోగ నియామకాలు, ఉపాధి వైపు అడుగులు వేయకుండ, వృత్తికి అంకితమై సేవలందించారని, గతంలో గెస్ట్ లెక్చరర్లుగా పీ.జీ.,పీ. హెచ్., సెట్, నెట్ చేసిన వారుసైతం పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ ఉద్యోగానికి మరింత భద్రత లభిస్తుందనే నమ్మకంతో తెలంగాణ సాధన ఉద్యమంలో సైతం భాగస్వాములయ్యారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించడంతో గెస్ట్ లెక్చరర్లు మరింత ఆశతో తమ ఉద్యోగాలనుసైతం ఎప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఏడాది గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయకుండ గెస్ట్ లెక్చరర్ల నోటిఫికేషన్ జారీచేయడంతో దశాబ్దకాలంగా విద్యార్థులకు సేవలందించిన గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గెస్ట్ లెక్చరర్లు ఇతర వృత్తులకు వెళ్లలేక, నూతనంగా గెస్ట్ లెక్చరర్ల నియామకంలో యువతతో పోటీపడలేని పరిస్థితులల్లో, కనీసం సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోకుండ, పీజీలో మెరిట్ ఆధారంగా లెక్చరర్ల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, నిరుద్యోగుల మధ్య చిచ్చురేపుతున్నారనే భావనను తలపించేలా నోటిఫికేషన్ ఉందని, ప్రస్తుతం నోటిఫికేషన్లో కేవలం పీ.జీ.మెరిట్ ఆధారంగా గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపట్టనుండడంతో దశాబ్దకాలంగా సేవలందించిన గెస్ట్ లెక్చరర్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఇంటర్మీడియేట్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తూ, విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దుతున్న గెస్ట్ లెక్చరర్లను గతంలోలాగా ఈ ఏడాది కూడా రెన్యూవల్ చేసి, వారి సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.