కొండగట్టులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

కొండగట్టులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
  • లక్షలాధిగా తరలివచ్చిన భక్తులు, దీక్ష పరులు
  • స్వామివారికి లక్ష తమలపాకులతో అలంకరణ.. పూర్ణహుతి

ముద్ర, మల్యాల: తెలంగాణలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో గల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం పెద్ద జయంతి వేడుకలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రo నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షల వరకు భక్తులు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా కొండగట్టు క్షేత్రం అంజన్న, రామ నామ స్మరణతో మర్మోగిoది.. ఇది ఇలాంటి ఉండగా, జయంతి సందర్బంగా తెల్లవారుజామున స్వామివారి మూలవిరాట్ ను లక్ష తమలపాకులు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం యాగశాలలో 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వివిధ పుజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

అందులో భాగంగా విశేష అభిషేకం, తులసి అర్చన, పట్టు వస్త్రాల అలంకరణ, నాగవల్లి అర్చన, స్నపన తిరుమంజనం, మహా నివేదన, మంత్ర పుష్పము, పూర్ణహుతి, ఉయ్యాలసేవా, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటల నుంచి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన, ఒడిబియ్యం, సహస్ర దీపాలoకరణ, గరుడ వాహనసేవా, మహాదాశీర్వాదం, సామూహిక భజన, సంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు కపీoదర్, ప్రధాన అర్చకులు జితేందర్ స్వామి, చిరంజీవి, ఫౌండర్ ట్రస్ట్ మారుతి, ఈవో వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా ఎస్పీ ఎగ్గాడి భాస్కర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం రాత్రి రద్దీ ఉన్న దృష్ట్యా ఏర్పాట్లు పర్యవేక్షించారు. వారి వెంట డీఎస్పీ ప్రకాష్, స్థానిక సీఐ రమణామూర్తి, ఎస్సై చిరంజీవి, బీఆర్ఎస్ నాయకులు జనగాం శ్రీనివాస్, బద్దం తిరుపతి రెడ్డి, తదితరులు ఉన్నారు.

 అష్ట కష్టాలు పడ్డ భక్తులు.. ఈవో నిలదీత... కొండగట్టు ఆలయ అధికారులు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి... మౌలిక సదుపాయాలు లేక భక్తులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే  కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన... అధికారులు మాత్రం భక్తులకు కష్టాలు చూపిస్తున్నారు. ఆదివారం ఉదయం క్యూలైన్ లో మూడు గంటల సేపు దర్శనంకు నిరీక్షించిన భక్తులు త్రాగునీరు కరువై ఇబ్బందులు పడ్డారు.  డానికి తోడు ఉక్కపోతతో  కొండపై భక్తులు అష్ట కష్టాలు పడ్డారు. స్వామి మాల ధరించిన పలువురు చిన్నారులు, మహిళలు క్యూలైన్ లో సోమ్మసిల్లి పడిపోయారు. ఓ బాలుడిని క్యూలైన్ నుంచి బయటకు తీసుకోచ్చి పోలీసులు, వైద్య సిబ్బంది గ్లూకోజ్ వాటర్ అందజేశారు.

వెంటనే పోలీసులు వాకిటాకి ద్వారా ఆలయ అధికారులు సమాచారం అందించిన ఫలితం లేదు. కాగా, భక్తులు ఈవో వెంకటేష్ ను నిలదీశారు. కనీసం వాటర్ ప్యాకెట్స్ అందజేస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి విధులు నిర్వహించిన సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్నారని ఈవో సమాధానం చెప్పడంతో ఎక్కువ మందిని ఆరెంజ్ చేసుకోవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా, సమాధానం చెప్పకుండా ఈవో అక్కడినుండి జారుకున్నారు. ఇది ఇలాంటి ఉండగా, కోనేరు లో పూర్తిగా మురికిగా మారిన నీటిలో స్నానము చేసేందుకు భక్తులు ఇష్టపడలేదు. శానిటేషన్ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసిన చెత్త పేరుకుపోయింది. ట్రై సైకిల్స్ లేకపోవడంతో దర్శనానికి వచ్చిన వికలాంగులకు ఇబ్బంది అయింది. పూర్తిగా నడవరాని ఓ వికలాంగున్ని సంపత్ అనే కానిస్టేబుల్ ఎత్తుకొని దర్శనానికి తీసుకెళ్లారు.

 ముగిసిన జయంతి ఉత్సవాలు...
కొండగట్టులో ఆదివారం జరిగిన అంజన్న జయంతితో మూడు రోజుల ఉత్సవాలు ముగిసాయి. స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులు, దీక్ష పరులు మొక్కులు తీర్చుకుని, తిరుగు పయనమయ్యారు. జయంతి సందర్బంగా కొండ కింద, ఘాట్ రోడ్డుపై  వందలాదిగా వివిధ దుకాణాలు వెలిసాయి. పలు స్వచ్చంద సంస్థలు, నాయకులు భక్తులకు సేవా కార్యక్రమాలు, అన్నదానం, చలివెంద్రాలు ఏర్పాటు చేశారు.