హరితహారం లక్ష్యాన్ని అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి : కలెక్టరు టి.వినయ కృష్ణారెడ్డి

హరితహారం లక్ష్యాన్ని అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి : కలెక్టరు టి.వినయ కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి :తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు టి.వినయ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కాన్ఫరెన్స్ హాలులో ఆయన జిల్లాలో జరుగుతున్న హరితహారం కార్యక్రమాలను జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో హరితహారం ద్వారా 21 లక్షల 88 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని ఇవ్వడం జరిగిందని, ఇందులో 8 లక్షల 75 వేల మొక్కలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా, 2 లక్షల మొక్కలు జిల్లా అటవీ శాఖ ద్వారా, 3 లక్షల మొక్కలు 6 మున్సిపాలిటీల ద్వారా, మిగిలినవి వివిధ శాఖల ద్వారా నిర్దేశించడం జరిగిందని, ఇప్పటి వరకు 15 లక్షల 4 వేల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. మిగతా లక్ష్యాన్ని వేగంగా సాధించాలని, గుంతలు తీసే పని పూర్తి చేసి త్వరగా ప్లాంటేషన్ పూర్తి చేయాలని, ఇజిఎస్, నాన్ ఇజిఎస్ పనుల క్రింద కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యంగా ప్లాంటేషన్, జియోట్యాగింగ్, క్షేత్ర స్థాయి పరిశీలన ముఖ్యమని, జిల్లా అధికారుల నుండి గ్రామ పంచాయితీ స్థాయి వరకు వివిధ దశలలో పనులు సమన్వయపరచుకొని మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని, నాటిన మొక్కలకు రక్షణ ముఖ్యమని తెలిపారు. గృహ  అవసరాలకు సంబంధించి పంపిణీ చేసిన మొక్కలు నాటుకున్న వివరాలు, మొక్కల పరిస్థితిపై డోర్ టూ డోర్ పరిశీలన చేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు అందించాలని, జిల్లా, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో నాలుగు రోజులకోసారి అయినా మొక్కల సంరక్షణ పనులను పరిశీలించాలని ఆదేశించారు.

ప్రతి మండలానికి 5 చొప్పున కేటాయించిన బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి 85 బృహత్ పల్లెప్రకృతి వనాలకు గాను 51 వనాలు పూర్తి అయ్యాయని, మిగతా వాటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్ పట్టణ ప్రకృతి వనాలకు సంబంధించి భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలలో పూర్తి అయ్యాయని, మిగతా మున్సిపాలిటీలలో కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 421 గ్రామ పంచాయితీలు, 229 హ్యాబిటేషన్లలో ఏర్పాటు చేసిన 650 పల్లెప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణను పరిశీలిస్తుండాలని సూచించారు. రోడ్లు భవనాల శాఖ, పంచాయితీరాజ్ శాఖల ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. పండ్ల తోటల పెంపకానికి సంబంధించి 2023-24 సంవత్సరానికి జిల్లాలో 1410 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 831 ఎకరాలు గుర్తించడం జరిగిందని, మిగతా లక్ష్యాన్ని కూడా గుర్తించి రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయాలని, ఫీల్డ్ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు జి.వీరారెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు నాగిరెడ్డి, జిల్లా అటవీ అధికారి పద్మజారాణి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూక్యా మాన్యా, జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా వెనుకబడిన తరుగతుల సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, ఎస్సి కార్పోరేషన్ ఇది శ్యాంసుందర్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, జిల్లా గ్రౌండ్ వాటర్ డిడి జ్యోతికుమార్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి నర్సింహ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, రోడ్లు భవనాల శాఖ ఎస్ఇ శంకరయ్య, పంచాయితీ రాజ్ శాఖ ఇఇ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డిఎం గోపీకృష్ణ, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, మున్సిపల్ కమిషనర్లు,  అధికారులు పాల్గొన్నారు.