స్నేహితుడితో కలిసివెళ్లి శవమై వచ్చాడు

స్నేహితుడితో కలిసివెళ్లి శవమై వచ్చాడు

బీబీనగర్ పెద్ద చెరువులో మునిగి యువకుడి మృతి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: చెట్టంత కొడుడు... కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న తరుణంలో ఆ తల్లిదండ్రుల కలలను విధి కల్లలు చేసింది. కని పెంచిన కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్దచెరువులో మునిగి ఒక యువకుడు సోమవారం మృతి చెందాడు. బీబీనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ యుగంధర్ అందించిన వివరాల మేరకు మృతి చెందిన యువకుడిని వానరాసి తరుణ్ (24)గా గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లికి చెందిన ఈ యువకుడు కారు డ్రైవరుగా విధులు నిర్వహిస్తూ, తల్లిదండ్రులకు ఆర్థికంగా కొంతమేరకు ఆసరాగా నిలుస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం తన స్నేహితుడు డీకొండ నితిన్ తో కలిసి బీబీనగర్ వచ్చాడు. ఎండలు మండిపోతుండడంతో ఇద్దరూ కలిసి బీబీనగర్ పెద్ద చెరువులో ఈత కొట్టాలని నిర్ణయించారు. ప్రమాదవశాత్తూ తరుణ్ నీట మునిగి చనిపోయాడు. మృతి చెందిన యువకుడి తండ్రి గోవిందాచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు. తన కుమారుడి మరణానికి స్నేహితుడు నితిన్ కారణంగా గోవిందాచారి అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.