మునగ తోటకు అపార నష్టం .. ఆదుకోవాలంటూ రైతుల ఆవేదన

మునగ తోటకు అపార నష్టం  .. ఆదుకోవాలంటూ రైతుల ఆవేదన

ముద్ర.వీపనగండ్ల :- అప్పుచేసి ఆరు కాలం కష్టపడి పండించే పంటలు వర్షాల వల్ల పాడవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వివిధ గ్రామాలలో కూరగాయల తోటలకు భారీ నష్టం వాటిలాగా, మండలంలో భీమ కాలువ కోత గురికావడంతో సుమారు  70 ఎకరాల వరి పంటలలో ఇసుక మేటలు వేయడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. వీపనగండ్ల గ్రామానికి చెందిన పెబ్బేటి మహేష్, శ్రీకాంత్ ఇద్దరు రైతులు గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి ఎకరాకు పదివేల చొప్పున ఏడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మునగ తోటను సాగు చేస్తున్నాడు. గత వారం రోజుల వరకు మునుగతోట బాగుండడంతో మరో రెండు నెలలు కష్టపడితే మునగ తోట నుంచి మంచి లాభాలు అర్జించవచ్చని కలలు కన్నాడు.

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మునుగతోట పై పెట్టుకున్న అతడి ఆశలు అడియాశలు అయ్యాయి. భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీళ్ళు మునుగ తోటలో వచ్చి చేరడంతో మునగ తోట కుళ్ళిపోయి పనికి రాకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఏడెకరాలలో సాగుచేసిన మునుగతోటకు ఇప్పటికే రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు పెబ్బేటి మహేష్, శ్రీకాంత్ తెలిపారు. మునగ తోటలో నీళ్ళు నిల్వ ఉండటంతో జెసిబి తో కాలువలు తీయించి బయటకు తోడటం జరిగిందని, పొలంలో నీళ్లు చేరుతుండడంతో మోకాళ్ళ లోతు దిగబడుతున్నాయని, పరిస్థితి ఇదే విధంగా ఉంటే మరింత నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. వ్యవసాయ అధికారులు పాడైన మునుగ తోటను పరిశీలించి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.