గోదావరిలోకి భారీగా వరద నీరు

గోదావరిలోకి భారీగా వరద నీరు
  • లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయిస్తున్న అధికారులు
  • పునరావాస కేంద్రానికి ఎన్ టీఆర్ కాలనీవాసులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ఎల్లంపల్లి ప్రాజెక్టు కు ఎగువ ప్రాంతం నుంచి ఉదృతంగా వరద నీరు చేరుతుండడంతో గోదావరి పరివాహక లోతట్టువాసులను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీరాంసాగర్ ,కడెం ప్రాజెక్టు నుంచి వరద నీరు దిగువన గోదావరి నదిలో కి విడుదల చేయడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధీంతో ఎల్లంపల్లికి వరద ప్రవాహం పెరిగింది. 32 గేట్లు ఎత్తి వేసి ఐదు లక్షల క్యూసెక్కుల పైగా నీటి విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాలకు ముంపు ఏర్పడింది. ధీంతో  రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ, పురపాలక శాఖలు  అప్రమత్తమయ్యాయి. గత ఏడాది గోదావరి పోటెత్తడం అందులో విలీనమయ్యే రాళ్ళవాగు బ్యాక్ వాటర్ తో  ఎన్ఠీఆర్ కాలనీ, ఎల్ ఐ సీ, డూప్లెక్స్, మెదరివాడ వరద ముంపుకు బలయ్యాయి. లక్షలాది రూపాయలు నష్టపోయారు. గత అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని ముందుగా ఎన్ టీఆర్ కాలనీ వాసులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ధీంతో ఇంటి సామాగ్రి, నిత్యావసర సరుకులు, విలువైన వస్తువులతో పునరావాస కేంద్రాలకు వెళ్లారు. వారి కోసం హిందీ హైస్కూలు, భవన నిర్మాణ సంఘం భవనం లో తాత్కాలిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంత వాసులను అప్రమత్తంగా ఉండాలని వరదలు వచ్చే ముందు ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. కాగా నిన్నరాత్రి కురిసిన వర్షాలకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందుతున్న వార్డులోకి వరద నీరు చేరుకుంది. రెండు అండర్ బ్రిడ్జిలోకి కూడా నీళ్లు చేరిపోవడంతో కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.