కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు - నిండుతున్న ప్రాజెక్టులు
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు ఏరులై పారుతున్నాయి. తాడ్వాయి మండలం సంతాయిపెట్ గ్రామంలో భీమేశ్వర వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. పోచారం ప్రాజెక్టు భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 1567 క్యూస్కులు వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం1464 అడుగులు(1.820 టీ యం సి) కాగా.. ప్రస్తుతం 1459 అడుగులు(1.078 టీ యం సి ) నీరు ప్రాచారం ప్రాజెక్ట్ లో ఉంది. రాజంపేట మండలం గుండారం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు, గుండారం నుంచి కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి.నిజాంసాగర్ ప్రాజెక్టులో 12,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, 1392 అడుగులకు నీరు చేరింది. 5 టీఎంసీల నీరు నిలువ ఉంది. పోచారం ప్రాజెక్టులోను భారీగా ఇన్ ఫ్లో వస్తోంది.
నస్రుల్లాబాద్ మండలం బొమ్మ దేవిపల్లిలో రికార్డు స్థాయిలో 13.7 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. బొమ్మదేవి పల్లిలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. నీట మునిగిన పంటలు, సబ్ స్టేషన్ లోకి చేరిన నీరు చేరుతుంది. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.
2న విద్యా సంస్థలకు సెలవు
భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటిఐలు, రెసిడెన్సియల్ విద్యా సంస్థలకు ఈనెల 2వ తేదీన సోమవారం నాడు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐటిఐలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఈ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
పోచారం నుంచి త్వరలో నీరు విడుదల
అధిక వర్షాలు కురుస్తుందన్న ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి ప్రాజెక్టు నుండి నీరు కిందికి వెళుతుంది. ప్రాజెక్ట్ కింది ప్రాంతాలైన హవేలీ గన్ పూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీస్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఆలేరువాగు, పోచారంనది పరిసర ప్రాంతాలైన పోచంర్యాల్, సర్దానా, మాల్ తుమ్మెద, గోల్లింగల్, చినూర్ నాగిరెడ్డిపేట్, వెంకంపల్లి, తాండూర్ మాసన్ పల్లి, రుద్రారం గ్రామాల పంచాయతీ కార్యదర్శులు టాంటమ్ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.