తుంగతుర్తి ప్రాంతంలో భారీ వర్షాలు

తుంగతుర్తి ప్రాంతంలో భారీ వర్షాలు
  • పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
  • భారీగా అలుగులు పోస్తున్న చెరువులు కుంటలు
  • నీట మునిగిన పంట పొలాలు ఆందోళన చెందుతున్న రైతులు
  • శనివారం రాత్రి నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
  • తుంగతుర్తి పట్టణ సమీపంలోని రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపునీరు
  • తుంగతుర్తి నుండి వెలుగుపల్లి మీదుగా రవాణా బంద్

తుంగతుర్తి ముద్ర:- రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒకపక్క రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అవుతుండగా అదే రీతిలో తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు చెరువులు కుంటలు వాగులు, వంకలు పొంగిపొరుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. చెరువుల అలుగుల వరదతో పరివాహక ప్రాంతంలోని పొలాలు జలమయమయ్యాయి .నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని చెరువులన్నీ వర్షపు నీటితో నిండి కళకళలాడుతున్నాయి.

గత నాలుగైదు సంవత్సరాల కాలంగా గోదావరి జల్లాలతో నిండిన చెరువులనే రైతులు చూశారు తప్ప వర్షంతో నిండిన చెరువులను ఈ వర్షాకాలంలో చూస్తున్నామని రైతులంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో గోదావరి జల్లాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు కురిసిన భారీ వర్షాల వల్ల  అలుగులు పోస్తున్న చెరువులను చూసి మనోధైర్యం వచ్చిందని అంటున్నారు .పెట్టిన వరి నాట్లు నష్టపోకుండా పంటలు పండుతాయి అని రైతులు చెబుతున్నారు .తుంగతుర్తి నుండి వెలుగు పల్లి వైపు వెళ్లే రోడ్డుపై పెద్ద చెరువు వద్ద భారీగా నీటి ప్రవాహం ఉండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి .అదేవిధంగా తుంగతుర్తి నుండి మద్దిరాల వైపు వెళ్లే రహదారిపై తుంగతుర్తి సమీపంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో రాకపోగల కొంతమేర ఇబ్బంది కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు .ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తుంది.

నీట మునిగిన పంట పొలాలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు కనిపిస్తున్నాయి. ఈ వర్షం ఇలాగే మరొకటి రెండు రోజులు కొనసాగితే మాత్రం పలు చెరువులకు  గండ్లు పడే అవకాశం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్రమత్తమై ప్రమాద స్థాయిలో ఉన్న చెరువులను కుంటలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు  .శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు ఏకధాటిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో ఒక దశలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు పలు ప్రాంతాల్లో పిడుగులు పడిన శబ్దాలు ఆందోళనకు గురి చేశాయని ప్రజలు చెబుతున్నారు. ఏది ఏమైనా భారీ వర్షానికి తుంగతుర్తి ప్రాంతం అతలాకుతల మవుతుందని తెలుస్తోంది. వెలుగు పల్లి కేశవాపురం మధ్య బంధం పొంగి పొరలుతోంది. కేశవాపురం గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి .రానున్న ఒకటి రెండు రోజులు ఇంకా వర్షాలు రావచ్చని వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా మారుతాయి అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.