కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు హైకోర్టు షాక్

కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు హైకోర్టు షాక్
  • ఫోర్జరీ పత్రాలతో కాలేజీ అనుమతి పొందారని ఓయూ జాక్ నేత ఫిర్యాదు
  • నాలుగు వారాలలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశం
  • అప్పటి వరకు ఎలాంటి అనుమతులు రెన్యూవల్ చేయొద్దని ఏఐసిటిఈ , జె ఎన్ టి యు లకు ఆదేశాలు

ముద్ర ప్రతినిధి , కోదాడ:- కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకులు ఫోర్జరీ పత్రాలతో అనుమతులు పొందారని , దీనిపై తాను ఢిల్లీ లోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ , హైదరాబాద్ లోని జె ఎన్ టి యు కి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కోదాడకు చెందిన ఉస్మానియా యూనివిర్సిటీ జెఏసి నాయకుడు డాక్టర్ భట్టు శ్రీహరి రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ 8843/24 పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది . ఫిర్యాదు దారుడు చేసిన ఆరోపణలపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ , హైదరాబాద్ లోని జె ఎన్ టి యు లు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి నాలుగు వారాలలోగా తగు చర్యలు తీసుకోవాలని, అంత వరకు కళాశాలకు ఎటువంటి అనుమతులను పొడగించవద్దని కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది . దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి .

కోదాడ లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఇతరుల భూమిని తనదిగా చూపడంతో పాటు , ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ పొందినదని దీనిపై చర్యలు తీసుకోవాలని ఓయూ జెఏసి నేత జె ఎన్ టి యు కి ఫిర్యాదు చేసాడు . దీనిపై యూనివర్సిటీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడంతో వారు లెటర్ నెంబర్ : డిఏఎఫ్ఏ / కిట్స్ - డబ్ల్యుసీ / క్యూయు / కంప్లైంట్/ 2023 తేదీ 04-09-23 న నివేదిక ఇచ్చారు . ఈ నివేదికలో కళాశాల యాజమాన్యం తమదని చెపుతున్న డాక్యుమెంట్ నెంబర్ 9307 / 2007 కు సంబంధించి యాజమాన్యపు హక్కుల పత్రాలతో పాటు , దీనికి ఆర్డీఓ ఇచ్చిన నాలా సర్టిఫికెట్లను సమర్పించడంలో విఫలమైందని పేర్కొన్నారు . సమాచార హక్కు చట్టం ద్వారా దీనిని సేకరించిన భట్టు శ్రీహరి దీనిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీటియు , జె ఎన్ టి యు లకు 17-02-24 న ఫిర్యాదు చేశాడు . వారు స్పందించకపోవడంతో 18-03-2024 న మరోసారి ఫిర్యాదు చేశాడు . అయినప్పటికీ కనీస చర్యలు తీసుకోకపోవడంతో భట్టు శ్రీహరి రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 8843/2024 దాఖలు చేశాడు . దీనిపై వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి వి భాస్కర్ రెడ్డి ఈ నెల 23 న పై ఉత్తర్వులు జారీ చేశారు . ఇప్పటికైనా ఏ ఐ సి టి యు , జె ఎన్ టి యు లు తగు చర్యలు తీసుకోవాలని , అక్రమాలకూ పాల్పడిన కోదాడలో కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు భట్టు శ్రీహరి కోరారు .