ఇప్పటంలో  హైటెన్షన్

ఇప్పటంలో  హైటెన్షన్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు కారణమైంది. దీనిని అడ్డుకునేందుకు జనసేన నేతలు యత్నించారు. ఈ క్రమంలో గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో స్థానిక రామాలయంలోని గర్భగుడిలోకి వెళ్లిన జనసేన నేతలు తాళం వేసుకున్నారు. లోపలి నుంచే వారు నిరసన తెలియజేస్తున్నారు. జనసేన నేతలను బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రామ సరిహద్దుల్లో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు.. వూళ్లోకి ఇతరులను రాకుండా అడ్డుకుంటున్నారు. ఐడీ కార్డులు పరిశీలించి, వివరాలు నమోదు చేసుకున్నాకే వారిని లోపలికి అనుమతిస్తున్నారు.   మరోవైపు.. ఇళ్ల కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమణల పేరుతో కావాలనే కక్ష గట్టి కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు కూడా రాని ఊరికి ఆరు లైన్ల రహదారి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేత ప్రక్రియను వ్యతిరేకిస్తూ గ్రామస్థులతో కలిసి జనసేన మద్దతుదారులు నిరసనకు దిగారు. వైసీపీ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. ఇళ్ల కూల్చివేత ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటంలో కూల్చివేతను జనసేన  పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ సభకు స్థలాన్ని ఇచ్చారనే  వైసీపీ  సర్కార్ కక్ష గట్టి మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.