ఎకరం  రూ.100.75 కోట్లు

ఎకరం  రూ.100.75 కోట్లు
  • కోకాపేట భూములకు ఆల్ టైం రికార్డు
  • ఏపీఆర్, రాజపుష్ప మధ్య పోటాపోటీ
  • ఆఖరికి దక్కించుకున్న హ్యాపీ హైట్స్, రాజపుష్ప
  • పక్కనే ఉన్న ప్రైవేట్ భూములపై పెరుగుతున్న ఆశలు
  • రియల్ కంపెనీల చేతుల్లోనే శివారు భూములు

ముద్ర, తెలంగాణ బ్యూరో:  కోకాపేట భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. కోకాపేట.. వందల కోట్లపేటగా మారింది. కోకాపేట భూముల వేలం రికార్డుల మోత మోగించింది. నియోపోలిస్ ఫేజ్–-2లోని 3.6 ఎక‌రాల ప్రైమ్ ప్లాట్‌ను హ్యాపీ హైట్స్​నియోపొలిస్, రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్​లిమెటెడ్ కంపెనీ సొంతం చేసుకుంది. వేలంలో పోటీప‌డి ఎక‌రానికి రూ.100.75 కోట్లు పెట్టి ఈ ప్లాటును కొనుగోలు చేసింది. ఈ భూమిలో రాజ‌పుష్ప ప్రాప‌ర్టీస్‌కు డెవ‌ల‌ప్‌మెంట్ చేయనున్నది. ఈ క్రమంలో కోకాపేట పక్కన ఉన్న ప్రైవేట్​భూముల్లో ఒక్కసారిగా ఆశలు పెరిగాయి. ఇక్కడ చాలా రియల్ సంస్థలకు భూములున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ధర పెరగడంతో ఇక రియల్ బూమ్ ఊహించని స్థాయిలో పెరుగనున్నట్లు స్పష్టమవుతుంది. 

హైదరాబాద్ చరిత్రలోనే రికార్డు ధర..

కోకాపేట భూములను గురువారం ప్రభుత్వం ఈ- వేలానికి పెట్టడంతో కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. హైదరాబాద్ చరిత్రలోనే కోకాపేట భూముల ధరల రికార్డులు బద్దలయ్యాయి. కోకాపేట నియోపోలీస్‌ భూములు వేలంలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించాయి. ప్లాట్‌ నంబర్​10లో 3.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయగా ఎకరానికి ఏకంగా రూ.100.75 కోట్ల ధర పలికింది. కోకాపేట భూముల వేలం ప్రారంభమైన తర్వాత ప్లాటు ప్లాటుకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 6వ నంబర్ ప్లాట్​కు రూ.73 కోట్లు పలుకగా.. 9వ నంబర్‌ ప్లాటుకు ఎకరం భూమి రూ.75.25 కోట్లు పలికింది. 10వ నంబర్‌ ప్లాట్‌ కోసం ఏపీఆర్‌, -రాజపుష్ప కంపెనీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఎకరాకు అత్యధికంగా రూ.100.75 కోట్లతో హ్యాపీ హైట్స్ రాజపుష్ప ప్రాపర్టీస్​ సొంతం చేసుకున్నది.

ప్రభుత్వానికి రూ.3,319 కోట్ల ఆదాయం 

ప్రభుత్వానికి కష్ట సమయంలో కోకాపేట రూపంలో కాసుల వర్షం కురిసింది. మొత్తం 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేసింది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. ప్రభుత్వం ఆశించినట్టుగానే భారీ ఆదాయాన్ని ఆర్జించింది. నిజానికి, కోకాపేట దగ్గర రూ.2000 నుంచి రూ.2,500 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని హెచ్ఎండీఏ ఆశించింది. కోకాపేట నియో పోలిస్ భూములల్లో మల్టీపర్పస్ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉండడంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్‌కు ఉపయోగించుకునే అవకాశం ఉంది. భారీ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎయిర్ పోర్టుకు, సిటీకి అత్యంత దగ్గరలో ఉన్న భారీ లేఅవుట్ కోకాపేట నియో పోలిస్ లేఅవుట్.. దీంతో డిమాండ్ భారీగా పెరిగింది. 45.33 ఎకరాలకు మొత్తం రూ.3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది. 

వెనకడుగు లేదు..

కోకాపేట దగ్గర భూమి కోసం పోటీపడిన సంస్థలన్నీ ఎంత సొమ్ము పెట్టడానికైనా వెన‌క‌డుగు వేయ‌లేదని వేలాన్ని చూస్తే అర్థమ‌వుతుంది. ఇక్కడ రాజపుష్ప ప్రాపర్టీస్ ఎక్కువ భూములు దక్కించుకున్నది. అయితే పలు సంస్థలతో కలిసి ఈ భూములు దక్కించుకున్నది. హ్యాపీ మొబైల్స్ ఆధ్వర్యంలో రాజపుష్పతో ముందుగానే ఒప్పందం చేసుకుని, రెండు సంస్థల ఆధ్వర్యంలో వేలంలో అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేశారు. అస‌లీ ప్లాటుకు ఎందుకు అంత ధ‌ర పెట్టాల్సి వ‌చ్చింద‌నే అంశాన్ని ప‌రిశీలిస్తే.. ఈ 3.6 ఎక‌రాల చిన్న ప్లాటుకు స‌రిగ్గా గండిపేట్ లేక్ వ్యూ ఉండ‌ట‌మే ప్రధాన కార‌ణం. అందుకే వేలంలో ఒక్కసారిగా పోటీ పెరిగింది. అయినా హ్యాపీహైట్స్, రాజపుష్ప సంయుక్తంగా త‌గ్గేదేలేదంటూ ఎక‌రానికి రూ.100.75  కోట్లు పెట్టి ఎట్టకేల‌కు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ కొనుగోలు చేసిన 3.6 ఎక‌రాల్లో కనీసం 200కు పైగా ఫ్లాట్లను క‌ట్టే అవ‌కాశ‌ముంది. టవ‌ర్ల విస్తీర్ణం దాదాపు 50 అంత‌స్తుల దాకా ఉంటుంద‌ని అంచ‌నా. ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం దాదాపు 10 వేల చ‌ద‌ర‌పు అడుగుల దాకా ఉంటుంద‌ని స‌మాచారం. ఇక కోకాపేట భూములతో చుట్టూ పక్కల ఉన్న ప్రైవేట్ భూములకు అమాంతం ధరలు పెరుగనున్నాయి. వీటిలో చాలా భూములు రియల్ సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. 

==================================================================================
        ప్లాట్​ నంబర్​  ఎకరాలు ఎకరానికి ప్రభుత్వ ధర పలికిన ధర  మొత్తం ఆదాయం దక్కించుకున్న సంస్థ
==================================================================================
6  7 35 కోట్లు  73 కోట్లు  511 కోట్లు  ఎం.ఎస్.ఎన్. ఫార్మా
7  6.55 35 కోట్లు  75.50 కోట్లు  494.53 కోట్లు నవత్రీస్ ఇన్వెస్ట్​మెంట్, రాజపుష్ప
8  9.71 35 కోట్లు  68 కోట్లు  660.28 కోట్లు బ్రిగేడ్ ఎంటర్​ప్రైజెస్​
9  3.60 35 కోట్లు  75.25 కోట్లు  270.90 కోట్లు డీ బ్లూఓక్ అండ్ మంగత్​రాయ్​
1‌‌0  3.60 35 కోట్లు  100.75 కోట్లు 362.70 కోట్లు హ్యాపీహైట్స్, రాజపుష్ప ప్రాపర్టీస్​
11  7.53 35కోట్లు  67.25 కోట్లు  506.39 కోట్లు ఏపీఆర్ గ్రూప్​
14  7.34  35 కోట్లు  70 కోట్లు  513.80 కోట్లు లక్ష్మీనారాయణ, వంగల శ్యాంసుందర్​రెడ్డి, వెంకటేశ్వర్​రావు, కర్టీశ్​​ రెడ్డి