ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యం

ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యం
  • పలు రకాల రక్త పరీక్షల పేరుతో భారీగా ఫీజులు వసూలు
  • వైరల్‌ జ్వరానికి సైతం మలేరియా, డెంగ్యూ పరీక్షలు!
  • అనుమతులు లేకుండానే ల్యాబ్‌లు, శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు నిర్వహణ
  • అర్హత లేని వ్యక్తులతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు
  • తప్పుడు రిపోర్టులతో రోగుల ప్రాణాలకు ముప్పు
  • కొరవడిన వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు వైద్యులు, డయోగ్నస్టిక్‌ కేంద్రాలు, ల్యాబ్‌ల నిర్వాహకులు, రోగుల నుంచి అందినంత దోచేస్తున్నారు. వైరల్‌ జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన బాధితులకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో ల్యాబ్‌ లేకపోతే.. ఫలానా ల్యాబ్‌కు వెళ్లాలని సిఫారసు చేస్తున్నారు. ఇక ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు నిర్ణీత ఫీజులకన్నా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల కనీస పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో ప్రైవేటు వైద్యులు, ల్యాబ్‌లు, డయోగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా రోగులు నుంచి డబ్బులు దండుకుంటున్నారు.

కొద్ది రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యలోపం వల్ల దోమలు విజృంభించి ప్రజలు మలేరియా, డెంగ్యూతోపాటు టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాల బారినపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వ్యాధి నిర్ధారణ పరీక్షలు జాప్యం అవుతున్నాయన్న ఉద్దేశంతో పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు జ్వరబాధితులు ప్రైవేటు ఆసుత్రులకు వెళుతున్నారు. కొంతమంది వైద్యులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ నిర్ధారణతోపాటు షుగర్‌, మూత్ర పరీక్షలు కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు. ల్యాబ్‌లలో టైఫాయిడ్‌, మలేరియా నిర్ధారణ పరీక్షలకు రూ.100 నుంచి రూ.150 తీసుకోవాల్సి ఉండగా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. డెంగ్యూబారిన పడితే రక్త పరీక్షకు (ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌) రూ.800 నుంచి రూ.1000, తైరాయిడ్‌ పరీక్షకు రూ.800 వరకు వసూలు చేస్తున్నారు.

అనుమతులు లేని ల్యాబ్‌లే ఎక్కువ....

జిల్లాలో ఎటువంటి అనుమతులు లేని డయోగ్నస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు, ఆస్పత్రులు అధిక సంఖ్యలో వున్నాయి. వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకులు కుమ్మక్కై.. అవసరం లేని వైద్య పరీక్షలు కూడా చేయిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ల్యాబ్‌ల నిర్వాహకులు పరీక్ష ఫీజుల రూపంలో వసూలు చేసే సొమ్ములో 30 నుంచి 40 శాతం వరకు సంబంధిత వైద్యులకు కమిషన్‌గా అందజేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. జిల్లా కేంద్రంలో , అదే విధంగా పట్టణ కేంద్రాలలో  కొంతమంది రక్త పరీక్షల పేరుతో అనుమతులు లేకుండా ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. వీటిపై గతంలో అనేకమంది ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు.

అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు

జిల్లాలో పలు ల్యాబ్‌లను పేథాలజిస్టులు లేకుండానే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని ల్యాబ్‌లలో కనీస అర్హతలు లేనివారు నియమించుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి ల్యాబ్‌లో ఇచ్చే రిపోర్టులను ఎలా నమ్మాలని రోగులు వాపోతున్నారు. ఇటీవల కోదాడ పట్టణంలోని ఒక పేరు పొందిన ల్యాబ్ లో ఒక వ్యక్తి సాధారణ పరీక్షలలో భాగంగా షుగర్ పరీక్ష చేయించుకోగా షుగర్ వ్యాధి ఉన్నట్లు రిపోర్టు వచ్చింది . అనంతరం మరో మూడు రోజుల తర్వాత మరో ల్యాబ్ లో షుగర్ పరీక్షా చేయించుకోగా రిపోర్టు నార్మల్ గా రావడంతో , అనుమానంతో మరో ల్యాబ్ లో కూడా షుగర్ పరీక్ష చేయించుకోవడంతో అక్కడ కూడా నార్మల్ రిపోర్టు వచ్చింది . అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి వైద్య పరీక్షకు అయ్యే ఖర్చులకు సంబంధించి ల్యాబ్‌లో అందరికీ కనిపించేలా ధరల పట్టికలను ఏర్పాటు చేయాలి. ల్యాబ్‌లో పనిచేసే అసిస్టెంట్‌, పేథాలజిస్ట్‌ ఫొటోతో ఉన్న విద్యార్హత ధ్రువపత్రాన్ని రిసెప్షన్‌ వద్ద ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లో ఇవేవీ కనిపించవు. అనకాపల్లిలో కొంతమంది వైద్యులు ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి పొంది, ల్యాబ్‌లను అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు ఆర్ ఎం పి లు కూడా వారి క్లినిక్ లలోనే ల్యాబ్ లు ఏర్పారు చేసుకొని కొన్ని పరీక్షలు వారే నిర్వహిస్తుండటం కొసమెరుపు .