మేడారం జాతరకు 500సీసీ కెమెరాలు, 14 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు...

మేడారం జాతరకు 500సీసీ కెమెరాలు, 14 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు...
  • మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

ముద్ర,తెలంగాణ:- ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ మేడారం జాతర జరగనుంది. ఈసారి మేడారానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు శ్రమిస్తున్నారు. జాతరలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెరుగైన సేవలందించేందుకు పోలీసుశాఖ చర్యలు తీసుకుంటోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించనున్నారు.

రద్దీ నియంత్రణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నారు అధికారులు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను కెమెరాల్లో ఇన్‌స్టాలేషన్‌ చేసి.. వాటిని కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేస్తారు. చదరపు మీటరులో నలుగురి కంటే ఎక్కువ మంది ఉంటే.. కంట్రోల్ రూమ్ కు సమాచారం వస్తుంది. వెంటనే కంట్రోల్‌ రూమ్‌ నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. అలాగే క్రౌడ్‌ కౌంటింగ్‌ కెమెరాల ద్వారా ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ములుగు పట్టణ శివారు నుంచి జాతర పరిసర ప్రాంతాల్లో 500 సీసీ కెమెరాలను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. 14 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ట్రాఫిక్‌, దొంగతనాలు, ఘర్షణలు, ప్రమాదాలు ఏం జరిగినా వెంటనే తక్షణ చర్యలు చేపట్టవచ్చు. మరోవైపు.. జాతర పరిస్థితులను అంచనా వేసేందుకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించనున్నారు. ఇప్పటికే 5 డ్రోన్‌లను అందుబాటులోకి తెచ్చారు.

జాతర వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి.. జాతర విశేషాలను ప్రసారం చేస్తారు. జాతర అంటే చాలా రద్దీగా ఉంటుంది. మేడారం జాతర జరిగే మూడురోజులూ.. ఇసుక వేస్తే రాలనంతమంది జనం ఉంటారు. అలాంటి సమయంలో విపరీతమైన రద్దీతో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోతుంటారు. అలా తప్పిపోయిన వారి ఫొటోలను కూడా ప్రసారం చేస్తారు.

కాగా.. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మేడారంకు వెళ్లే వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మిపథకం అమలులో ఉంటుందని ఇటీవలే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మేడారం జాతరకు మొత్తం 6000 స్పెషల్ బస్సుల్ని నడుపుతున్నట్లు తెలిపారు. జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో.. ఆయా జిల్లాల నుంచి ఎక్కువగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకూ మేడారం ప్రత్యేక బస్సులు ఉంటాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని తెలిపారు.