రాష్ట్రంలోనే హుజూర్ నగర్ ఆదర్శ నియోజక వర్గం

రాష్ట్రంలోనే హుజూర్ నగర్ ఆదర్శ నియోజక వర్గం
  • అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం పునరుద్ధరణ పనుల శంకుస్థాపన
  • రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక హుజూర్ నగర్ సీత రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం పునరుద్ధరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలసి చేపట్టారు. ఈ సందర్బంగా సభాపతి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజల అభీష్టనాలా మేరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేనంత అభివృద్ధి చేసిందని ఆ గొప్పతనం మంత్రి ఉత్తమ్ కుమార్ కే దక్కుతుందని అన్నారు. ఈ రెండు నియోజక వర్గాలలో చేసిన అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడికి మరువరని అన్నారు. తుది దశలో ఉన్న ఈ కాలనీ ఆరునెలల్లో పూర్తి చేసి నిరుపేదలకు అందించడం జరుగుతుందని రాష్ట్రంలో ఆదర్శ నియోజక వర్గం గా అందించనున్నారని అన్నారు.

రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలే నా బలం..అభివృద్దే నా లక్ష్యమని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో లిఫ్ట్ లు, రహదారులు, ఆసుపత్రులు, పరిశ్రమలు చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదలకు అందించే కాలనీ నిర్మాణానికి ఎంతో కృషి చేయడం జరిగిందని ప్రభుత్వ మార్పుతో గత పది సంవత్సరాలలో పనులు చేపట్టకపోవడం దురదుష్టకరమని అన్నారు. ఈ ప్రభుత్వం రూ.74.80 కోట్లు మంజూరు చేసిందని త్వరలో 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందించి హుజూర్ నగర్ లో ఇండ్లు లేని వారు లేకుండా చూస్తామని అన్నారు. తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ త్వరలో అందిస్తామని అన్నారు.

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇండ్లను అందించగా బి.ఆర్.ఎస్. పది సంవత్సరాల్లో 1 లక్ష 12 వేల ఇండ్లు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా హుజూర్ నగర్ లో హౌసింగ్ కాలనీ పరిశీలించి తుది దశలో ఉన్న ఇండ్లకు సత్వరమే రూ. 74.80 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ,7 నేలలో పూర్తి చేసి పేదలకు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందించనున్నని , 2008 డి.ఎస్.సి చేసిన వారికి త్వరలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం వచ్చిన తదుపరి 90 రోజులలోపు 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ధరణి ద్వారా కబ్జా చేసిన విలువైన భూముల లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం.. అభివృద్ధి పై పెట్టలేదని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ లను అర్హులైన అందరికి అందిస్తామని, నిజాయితీ, నిబద్ధతతో పాలన అందిస్తున్నామని అన్నారు. ఈ నియోజక అభివృద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అంతకు ముందు ఆటో డ్రైవర్లకు దక్షత ఫౌండేషన్ ద్వారా అందించే ఇన్సూరెన్స్ పథకాన్ని కోదాడ, హుజూర్ నగర్ ఆటో డ్రైవర్ లకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, యస్.పి. రాహుల్ హెగ్డే, హౌసింగ్ యస్.సి రవీంద్ర రావు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.