భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ...

భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ...
  • మార్చ్ 23 న దేశవ్యాప్త కోర్కెలదినం!
  • ఐజేయూ జాతీయ కార్యవర్గం పిలుపు! (డి. సోమసుందర్)

షిరిడీ (మహారాష్ట్ర) మార్చ్ 2: భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చ్ 23 న  జర్నలిస్టుల సమస్యలపై  దేశవ్యాప్త కోర్కెల దినాన్ని పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఐజేయూ జాతీయ కార్యవర్గ  సమావేశాలు  మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రం షిరిడీ లోని యాపిల్ సాయి రెసిడెన్సీలో శనివారం ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్ర స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆతిధ్యంలో రెండురోజుల పాటు జరగనున్న సమావేశాలకు ఐజేయూ అధ్యక్షుడు, తెలంగాణా మీడియా అకాడమీ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. దేశంలో జర్నలిస్టులు ఎదుర్కుంటున్న పలు తక్షణ సమస్యలను సమావేశంలో చర్చించారు. దేశంలో మీడియా సిబ్బంది స్థితిగతులు దిగజారి పోవడం పై సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది.

జర్నలిస్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం  వెంటనే ఒక ప్రత్యేక చట్టం చేయాలని, జర్నలిస్టుల, నాన్ జర్నలిస్టుల వేతన సవరణకు తక్షణం వేజ్ బోర్డును నియమించాలని, మీడియా రంగంలో వేగంగా  వస్తున్న మార్పుల నేపథ్యంలో  మీడియా స్వరూప స్వభావాలను అధ్యయనం చేయడానికి ఎలాంటి తాత్సారం చేయకుండా వెంటనే మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఐజేయూ కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. ఆమేరకు పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో జర్నలిస్టులను కలవర పరుస్తున్న తక్షణ సమస్యలను పాలక, ప్రతిపక్షాల దృష్టికి, పౌరసమాజం దృష్టికి తెచ్చేందుకు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి రోజు మార్చ్ 23 వ తేదీన దేశవ్యాప్తంగా భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ "జర్నలిస్టుల కోర్కెల దినం"  పాటించాలని ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. మార్చ్ 23 న ప్రజా ప్రతినిధులకు, వివిధ రాజకీయ పక్షాల నేతలకు, అధికారులకు జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాలు అందజేయాలని ఐజేయూ అనుబంధ రాష్ట్ర సంఘాలను కార్యవర్గం  కోరింది.

ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ  దేశంలో మీడియా సిబ్బందిపై, మీడియా సంస్థలపై  పెరిగిపోతున్న  దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేకచట్టం చేయాలన్న డిమాండ్ ను పునరుద్ఘాటించారు. పాత్రికేయుల వేతనవ్యవస్థ తీరుతెన్నులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు .2007 లో మజీతియా వేజ్ బోర్డును ఏర్పాటు చేయగా 2015 లో వేతన సవరణ సిఫార్సుల నివేదిక వచ్చిందని, దాన్ని 2017 లో నోటిఫై చేయగా దేశంలో   కేవలం 22 శాతం యాజమాన్యాలు మాత్రమే సిఫార్సులను అమలు చేశాయని వెల్లడించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

జర్నలిస్టుల  వేతన సవరణ కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ గత ఆరునెలలుగా యూనియన్ నిర్వహించిన కార్యకలాపాల నివేదికను కార్యవర్గం ముందుంచారు. దేశంలో మీడియా పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయని , ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను విమర్శనాత్మకంగా సమీక్షించే మీడియా సంస్థలపై ప్రభుత్వం నానాటికీ శత్రుపూరితంగా వ్యవహరిస్తోందని బల్విందర్ సింగ్ జమ్మూ వివరించారు. సోషల్ మీడియాను అదుపుచేయడం, ఫేస్ బుక్ పేజీలను స్తంభింప చేయడం, డిజిటల్ మీడియా వేదికల పనిని నిలిపివేయడం వంటి చర్యలు పెరిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల శంభు - ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనను కవర్ చేస్తున్న పాత్రికేయులకు బాష్పవాయువు గోళాలు తగిలి గాయపడ్డారని గుర్తు చేశారు. సమస్యలపై ఐక్య పోరాటాలను కొనసాగించాలని పిలుపు ఇచ్చారు.

ఐజేయూ పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్. సిన్హా మాట్లాడుతూ మీడియా రంగంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టులు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. జాతీయస్థాయిలో ఆరు వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్లు, వార్తా సంస్థల సిబ్బంది సంఘాలు ఒక తాటి మీదకు వచ్చి పోరాదుతున్నాయని వివరించారు. భావజాలపరమైన విభేదాలను పక్కనబెట్టి పోరాడాల్సిన తరుణం వచ్చిందన్నారు. జాతీయ కాన్ఫెడరేషన్ చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలలను ఉధృతం చేయాలని పిలుపు ఇచ్చారు. జర్నలిస్టుల భద్రత కోసం తాము ఒక నమూనా చట్టాన్ని తయారు చేశామని దానిపై సమగ్రంగా  చర్చించాలని రాష్ట్రాల యూనియన్లను కోరారు.

ఐజేయూ పూర్వాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మీడియాపై పెరుగుతున్న దాడులకు కేవలం రాజకీయ నాయకులను, పార్టీలను తప్పు పడితే సరిపోదని, వార్తలను వక్రీకరించి, తప్పుడు వార్తలు రాస్తున్న పత్రికా యాజమాన్యాల వైఖరులను కూడా ఖండించాలని అన్నారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ , పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్. సిన్హా , జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, బీహార్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ సిన్హా జాతీయ కార్యదర్శి డి.ఎస్.ఆర్. సుభాష్, హర్యానా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర  అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.ఎం.ప్రసాద్ జర్నలిస్టుల సమస్యలపై  వివిధ ప్రవేశపెట్టిన  తీర్మానాలను సమావేశం ఆమోదించింది.


సమావేశంలో ఐజేయు మాస పత్రిక స్క్రైబ్స్ న్యూస్ సంపాదకుడు ఆలపాటి సురేష్ కుమార్ , జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి , వివిధ రాష్ట్రాలకు చెందిన యూనియన్ నాయకులు కే. విరాహత్ అలీ (తెలంగాణ) ఏ .కే.సురేంద్రన్ (కేరళ ) రమేష్ శంకర్ పాండే (యూపీ) ప్రమోద్ కుమార్ ఝా (జార్ఖండ్) ఐ.వి.సుబ్బారావు ( ఆంధ్ర ప్రదేశ్ ) డి.ఎస్.ఆర్.సుభాష్ (తమిళనాడు) మత్తి మహారాజ (పాండిచేరి) రామ్ సింగ్ బ్రార్ ( హర్యానా) పి.భాస్కర్ రెడ్డి ( కర్ణాటక) మహేశ్ కుమార్ సిన్హా ( బీహార్), కే.సత్యనారాయణ (తెలంగాణ), తదితరులు  మాట్లాడుతూ తమ తమ రాష్ట్రాల్లో మీడియా సిబ్బంది సమస్యలు, నిర్వహించిన పోరాటాలను వివరించారు.

మహారాష్ట్ర స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గుండారి తొలుత  స్వాగతం పలుకుతూ  కేవలం మూడేళ్ళ క్రితం నూతనంగా ఏర్పడిన తమ రాష్ట్ర యూనియన్ ను మహారాష్ట్రలో వివిధ జిల్లాలకు విస్తరింప చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర యూనియన్  ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కరాత్ మాట్లాడుతూ ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. షిరిడీ లో శాంతి భద్రతల పరిరక్షణకు విశేషకృషి చేసిన డి.ఎస్పీ సందీప్ మిడ్కే పదోన్నతిపై బదిలీ అయిన సందర్భంగా ఆయనను ఐజేయు అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి  చేతులమీదుగా సత్కరించారు. ఇటీవల కన్నుమూసిన ఐజేయు జాతీయ ఉపాధ్యక్షుడు జి.ప్రభాకరన్  కేరళ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు యు.విక్రమన్ , తదితరులకు సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించింది.

సమావేశానికి హాజరైన ప్రభాకరన్ సతీమణి వాసంతి ప్రభాకరన్ , విక్రమన్ సతీమణి సీతా విక్రమన్ లను ఈ సందర్భంగా ఐజెయూ తరపున  ఘనంగా సత్కరించారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తమవంతు కృషి చేస్తామని వారిద్దరూ సమావేశంలో ప్రకటించారు. షిరిడీ కి చెందిన గ్రీన్ అండ్ క్లీన్ షిరిడీ ఫౌండేషన్ బాధ్యుడు జితేంద్ర షిర్కే సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ  తమ సంస్థ తరపున సత్కరించారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయడానికి కృషి చేసిన మహారాష్ట్ర  రాష్ట్ర యూనియన్, షిరిడీ ప్రెస్ క్లబ్ బాధ్యులను సమావేశంలో సత్కరించారు.