ఎన్నికల నామ సంవత్సరం....

ఎన్నికల నామ సంవత్సరం....
india general election 2023

ప్రపంచవ్యాప్తంగా క్యాలెండర్‌ మారిపోయింది. 2022వ సంవత్సరం చరిత్రలో కలిసిపోతూ 2023వ సంవత్సరాన్ని మనందరి ముందుకు తెచ్చింది. ఈ సంవత్సరంలో ఏమేం జరగబోతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాలను పరిశీలిస్తే 2024లో మన దేశం సార్వత్రిక ఎన్నికలకు పోబోతోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. వరుసగా రెండు విడతలు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకునేందుకు యధాశక్తి ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆసేతు హిమాచలం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కన్యాకుమారి వద్ద సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రారంభమైన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తర భారతంలో కొనసాగుతుంది.. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో 2023వ సంవత్సరాన్ని అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైతే, కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటే 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే దేశంలో దాదాపు 40 శాతం ప్రజలు తమ తమ రాష్ట్రాలకు ప్రభుత్వాలను ఎన్నుకోబోతున్నారు. ఇందులో పలు రాష్ట్రాలు కేంద్రంలో పాలకపక్షమైన భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. వచ్చే జనరల్‌ ఎలక్షన్స్‌ కంటే ముందు ఆయా రాష్ట్రాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఎంతైనా ఉంది. ఇక ఈ సంవత్సరం ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో రెండిరటిలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. వాటిని నిలబెట్టుకోవడంతోపాటు మరిన్ని రాష్ట్రాలను బిజెపి నుంచి తీసుకుని, తన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌ పార్టీకి కనిపిస్తుంది.నిజానికి 2022లో కూడా పలు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

మరిన్ని రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలు కూడా రాజకీయంగా రసవత్తరంగా కొనసాగాయి. వాటి ఫలితాలు ఎలా ఉన్నా మొత్తంగా 2022లో ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాయి. దాంతోపాటు పలు కీలక రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో గత సంవత్సరం వరకు కొనసాగిన శివసేన`కాంగ్రెస్‌`ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. శివసేన పార్టీని నిట్ట నిలువునా చీల్చిన ఏకనాథ్‌ షిండే వర్గం భారతీయ జనతా పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తక్కువ స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏకాదశి షిండేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి బిజెపి రాజకీయ చతురతను ప్రదర్శించింది. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేలా ఒప్పించారు బిజెపి పెద్దలు. ఆ విధంగా మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు కొన్ని రోజులపాటు ఉత్కంఠ రేపి చివరకు శివసేన రెబల్‌ వర్గం, బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో ముగిసాయి. అటు ఉత్తరాన బీహార్‌ లోను రాజకీయ పరిణామాలు నాలుగైదు రోజులపాటు ఆసక్తి రేపాయి. బిజెపితో కలిసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఉన్నట్టుండి బిజెపికి కట్‌ కొట్టారు. ఆర్జెడితో కలిసి కేవలం 24 గంటల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి నితీష్‌ కుమార్‌ వెంట ఆర్‌.జె.డి.తో పాటు కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా జత కలిశాయి. మహారాష్ట్ర, బీహార్‌ రాజకీయ పరిణామాలు పలువురిని కొన్ని రోజులపాటు ఆసక్తికరంగా ఆ రెండు రాష్ట్రాల వైపు చూసేలా చేశాయి.
కానీ రాజకీయ చాణక్యుడు కేసీఆర్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది తెలియని అంశం. 2018లో అసెంబ్లీ కాల పరిమితికి ఇంకా 9 నెలల సమయం ఉండగానే దాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికల వైపు మొగ్గు చేపారు కేసీఆర్‌. తన వ్యూహాత్మక నిర్ణయంతో ఘన విజయాన్ని సాధించారు. దేశ జనాభాలో దాదాపు 40 శాతం ఓటర్లు తమ తీర్పునిచ్చే ఈ 11 రాష్ట్రాల ఎన్నికలు కచ్చితంగా 2024 జనరల్‌ ఎన్నికలకు ముందు సెవిూఫైనల్‌ లాంటి ఎన్నికలుగానే పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.