మీకు రూ.100 ప్రజలకు రూ.1‌‌‌00 కోట్లా..?

మీకు రూ.100 ప్రజలకు రూ.1‌‌‌00 కోట్లా..?
  • బీఆర్ఎస్​ఆఫీసులకు స్థలం కేటాయింపుపై విచారణ
  • మూడు వారాల్లో కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీఆర్ఎస్​పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపుపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. హైదరాబాద్​నగరంతోపాటు మిగతా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం అధికార పార్టీకి గజం రూ.100 చొప్పున 33 జిల్లాలకు 34 ఎకరాలు కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిల్​పై బుధవారం విచారణ జరిగింది. ఇందులో పిటిషనర్​ తరుపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్​తన వాదనలు వినిపించారు. ఇటీవల ప్రభుత్వం కోకాపేటలో సర్కారు భూమిని ప్రజలకు ఎకరం రూ.100 కోట్లకు అమ్మిందని, అదే బీఆర్ఎస్ పార్టీకి అతి తక్కువ ధరకు కేటాయించిందని ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. 16 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినా.. ఈ కేసులో​ఐదో ప్రతివాదిగా ఉన్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ కౌంటర్​ దాఖలు చేయడంలేదని అభ్యంతరం తెలిపారు. పార్టీ కోసం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడితే ప్రజలకు ఇబ్బంది తలెత్తుతాయని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు అధికార పార్టీని కౌంటర్ దాఖలు చేయాలని బలవంతం చేయక్కర్లేదని స్పష్టం చేసింది. ప్రజలకు ప్రభుత్వ భూమిని ఎంత రేటుకు అమ్మకాలు చేశారో అదే రేటు బీఆర్‌ఎస్ పార్టీ చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ తీసుకున్న భూమికి ఎకరానికి రూ.వందకోట్ల రూపాయలు చెల్లించాలనే బెంజ్ మార్క్ తీర్పు ఉందని న్యాయస్థానం గుర్తుచేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణనువాయిదా వేసింది.