యాదాద్రి  ఇకపై యాదగిరిగుట్ట :  సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి  ఇకపై యాదగిరిగుట్ట :  సీఎం రేవంత్ రెడ్డి
  • యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు.టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు.గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తుచేశారు.కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు.బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు.

ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలన్నారు.ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి  రిపోర్ట్ అందించాలన్నారు.