పట్నంలో నేతల నామినేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

  • పరస్పరం రాళ్ల దాడి.. పలువురికి తీవ్ర గాయాలు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు ఎదురుపడడంతో ఘటన
  • పలు వాహనాలు ధ్వంసం.. పోలీసుల లాఠీఛార్జ్


ఇబ్రహీంపట్నం, ముద్ర:ఇబ్రహీంపట్నంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నిర్వహించిన ర్యాలీలు పరస్పరం ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల్లోని పలువురు  కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం మంచి రోజు కావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకేరోజు నామినేషన్ వేసేందుకు నిర్ణయించుకున్నారు. ముహూర్తం పెట్టుకొని మరీ భారీ ర్యాలీలతో నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో తొర్రూర్ లోని పార్టీ కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డి తన కార్యకర్తలు, అనుచరులతో ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

మరోవైపు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా స్థానికంగా తన అనుచరులు, కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు. నామినేషన్ సందర్భంగా ఇరువర్గాలు సాగర్ రహదారిపై ఎదురెదురుగా తారసపడడంతో కార్యకర్తలు ఒక్కసారిగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు రాళ్లదాడి కి పాల్పడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్‌ఎస్ నేతలపై విసురుకున్నారు. దీంతో సాగర్ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వాహనం దిగి వెళ్లిపోయారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా, వారు వినకపోవడంతో లాఠీచార్జి చేయక తప్పలేదు. రాళ్ల దాడిలో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలకు, పోలీసులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన వారిని స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాళ్ల దాడిలో పలు వాహనాలు అద్దాలు పగిలి పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.